3 రోజుల్లో 1750 కోట్ల కలెక్షన్లు.. దుమ్ము రేపుతున్న కెప్టెన్ అమెరికా 4.. అవెంజర్స్ రికార్డులు బ్రేక్!
కెప్టెన్ అమెరికా సినిమా సిరీస్‌లో భాగంగా నాలుగో సిరీస్‌గా కెప్టెన్ అమెరికాః బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్వెల్ కామిక్ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ అమెరికన్ సూపర్ హీరో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వ్యక్తమవుతున్నది. మార్వెల్ స్టూడియో బ్యానర్‌పై కెవిన్ ఫీగ్ నిర్మించిన ఈ సినిమాకు జూలియస్ ఓనా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ కలెక్షన్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా అభిమానించే కెప్టెన్ అమెరికా పాత్రను ఆంథోని మ్యాకీ పోషించగా, ఫాల్కన్ పాత్రను డ్యానీ రామరీజ్ పోషించాడు. ఈ చిత్రంలో షిరా హాస్, కార్ల్ లుంబీ, లివ్ టేలర్, టిమ్ బ్లేక్ నెల్సన్, హారిసన్ ఫోర్డ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు పాపులర్ టెక్నిషియన్స్ సేవలు అందించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 1600 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కెప్టెన్ అమెరికా 4 చిత్రానికి నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తున్నది. అమెరికేతర ప్రాంతాల్లో అంటే ఓవర్సీస్‌లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి ఆదరణను కనబరుస్తున్నారు. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే అవెంజర్ 1 మూవీ కలెక్షన్లను అధిగమించడం సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా 2024 రిలీజైన హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతూ కలెక్షన్లు సాధిస్తున్నది.
కెప్టెన్ అమెరికా: బ్రేమ్ న్యూ వరల్డ్ సినిమా నార్త్ అమెరికాలో రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్నది. ఈ చిత్రం మూడు రోజుల్లో 100 మిలియన్ డాలర్లు అంటే..భారతీయ కరెన్సీలో 870 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫిబ్రవరి మాసంలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ రికార్డును సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు 4.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 4.15 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 13.15 కోట్ల రూపాయలు రాబట్టింది. హిందీ వెర్షన్ మొత్తంగా 4.5 కోట్లు వసూలు చేయగా.. తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో ఈ సినిమాను అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారుగా 4000 స్క్రీన్లలో ప్రదర్శించడం గమనార్హం. గత మూడు రోజుల్లో ఈ చిత్రం నార్త్ అమెరికాలో 100 మిలియన్ డాలర్లు.. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం 192 మిలియన్ డాలర్లు అంటే.. 1750 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్, డెడ్ పూల్, బ్లాక్ పాంథర్ చిత్రాలతో సమానంగా పోటీ పడుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











