టాలీవుడ్ లో మారుతున్న ట్రెండ్
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ వుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో ఆరు పాటలు, రెండు ఫైట్లు వుంటే ఆడేసేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించుట లేదు. కథలో వైవిధ్యం వుంటేనే సినిమాలు ఆడుతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మధ్య వచ్చిన చిన్న చిత్రాలు విజయం సాధించడం. ఈ కోవలోకి 'వినాయకుడు', 'అష్టా చెమ్మా', 'కొత్త బంగారులోకం', 'నచ్చావులే' చిత్రాలు వస్తాయి. ఎలాంటి స్టార్ వ్యాల్యు లేకుండా, వైవిధ్యమైన కథనంతో వచ్చిన ఈ చిత్రాలు విజయం సాధించాయి.
అలాగే వైవిధ్యంగా వుంటే ఎలాంటి చిత్రాలయినా నిలబడుతాయనడానికి 'అరుంధతి' చిత్రం ఓ ఉదాహరణ. కథ, కథనం, భారీ సాంకేతిక పరిజ్ఞానమే హీరోగా వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూల్లు రాబట్టింది. అనుష్కను స్టార్ హీరోయిన్ ను చేసింది. అలాగే రామ్ చరణ్ కథానాయకుడుగా వచ్చిన 'మగధీర' చిత్రం కూడా దర్శకుడి చిత్రంగా పేరు తెచ్చుకొని టాలీవుడ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తోంది.
అలాగే 'రైడ్', 'ఓయ్', 'గోపి గోపిక గోదావరి' లాంటి చిత్రాలు కూడా కథ పాతదే అయినా ఆసక్తికరంగా చెప్పడంతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. కానీ భారీ అంచనాలతో వచ్చి కథనంలో వైవిధ్యం లేకపోవడంతో 'బిల్లా', 'మల్లన్న', 'మిత్రుడు', 'జోష్' లాంటి చిత్రాలు చతికిలపడ్డాయి. కాబట్టి ఇప్పుడంతా కథ, కథనం మీదే సినిమాలు నడుస్తున్నాయి అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











