Chhaava Telugu Day 1 Collections: బాక్సాఫీస్‌ను కుమ్మేసిన తెలుగు ఛావా.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
దేశవ్యాప్తంగా సంచలనంగా కలెక్షన్లు నమోదు చేస్తున్న ఛావా చిత్రం తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద విజృంభణ మొదలుపెట్టింది. మరాఠా యోధుడు శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మార్చే 7వ తేదీన తెలుగులో డబ్ అయి రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు కాసుల పంట పండింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజై విజయ ఢంకా మోగిస్తున్నది. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఛావా సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఛావా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను అతలాకుతలం చేసింది. ఈ చిత్రం గత 22 రోజుల్లో సుమారుగా ఇండియాలో 590 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 82 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 670 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇండియాలోను, ఓవర్సీస్‌లోను సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయగా తొలి రోజు బ్రహ్మండమైన ఆదరణ తెలుగు రాష్ట్రాల్లో దక్కింది. ఈ సినిమాకు ఆంధ్రా, నైజాంలోని ప్రధాన నగరాల్లో సుమారుగా 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రానికి రెండో రోజు కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం విశేషంగా మారింది.
ఛావా తెలుగు వెర్షన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 2.5 కోట్ల రూపాయల నికరంగా, 3 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో డబ్బింగ్ చిత్రం ఇలాటి ఓపెనింగ్స్‌ను సాధించడం ఇదే ప్రథమం. రెండో రోజు కోసం రెస్పాన్స్ చూస్తే ఈ మూవీ రన్ ఎక్కువ రోజులే కొనసాగేలా ఉందనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఛావా తెలుగు రెండో రోజు విషయానికి వస్తే.. ఈ మూవీకి శనివారం కూడా మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా ఆక్యుపెన్సీ తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా ఉంది. ఈ సినిమా రెండో రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











