Chhaava Telugu 4 days Collections: దుమ్ము రేపుతున్న ఛావా తెలుగు వెర్షన్.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న ఛావా చిత్రం తెలుగు వెర్షన్‌లో రిలీజై నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. దేశవ్యాప్తంగా రికార్డులను తిరుగ రాస్తున్న నేపథ్యంలో ఆలస్యంగా తెలుగులో రిలీజైనప్పటికీ భారీగానే కలెక్షన్లను రాబడుతున్నది. వికీ కౌశల్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా సుమారు మూడు వారాలు దిగ్విజయంగా ప్రదర్శించబడిన తర్వాత ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో తెలుగు భాషలోకి డబ్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన కనిపిస్తున్నది.

తెలుగులో ఛావా రిలీజ్ తర్వాత కొన్ని ఈవెంట్స్ ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయి. ఛాంపియన్స్ ట్రోఫి సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు ఉండటంతో ఈ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ కనిపించింది. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ.. భారీగానే కలెక్షన్లు రాబట్టడం చూస్తే ట్రేడ్ వర్గాలు ఓ పాజిటివ్ అంశంగా భావిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకొంటే భారీ విజయం వైపు దూసుకెళ్లే అవకాశం ఉంది.
ఛావా తెలుగు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు సుమారుగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం తొలి రోజు కంటే ఎక్కువగా నమోదు చేసింది. రెండో రోజు ఈ సినిమా 3.5 కోట్ల రాబట్టింది. ఇక మూడో రోజు ఈ చిత్రం ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌ను ఎదురించి 2.5 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగులో 8.5 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన ఫలితాన్ని సొంతం చేసుకొన్నట్టు ఆక్యుపెన్సీ తెలియజేసింది. ఈ సినిమా 4వ రోజున 45 శాతం ఆక్యుపెన్సీని రిజిస్టర్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నాలుగో రోజు ఈ మూవీ సుమారుగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఛావా చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 520 కోట్లకుపైగా నికరంగా, 620 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో బ్రహ్మరథం పట్టడంతో రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 85 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 720 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది.


Click it and Unblock the Notifications











