Chiranjeevi: రీ ఎంట్రీ తర్వాత అతి తక్కువగా చిరంజీవి రికార్డ్.. 'భోళా శంకర్' టార్గెట్ ఇదే!
స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇక గతేడాది గాడ్ ఫాదర్, ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్లు అందుకున్న చిరు ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో అలరించనున్నారు. అయితే చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అతి తక్కువగా రికార్డ్ నమోదు చేసుకుంది భోళా శంకర్ సినిమా. మరి ఆ వివరాలపై ఓ లుక్కేస్తే..

సాంకేతికవర్గం: మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. బిల్లా ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ అని తెలిసిందే. ఇందులో చిరు సరసన తమన్నా జోడీ కట్టగా.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్: ఆగస్టు 11న అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న భోళా శంకర్ సినిమాకు అనుకున్న స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. భోళా శంకర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్ లో రూ. 12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.40 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4.50 కోట్లు, నెల్లూరులో రూ. 3 కోట్లతో మొత్తంగా రూ. 67.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

క్లీన్ హిట్ స్టేటస్: ఇక భోళా శంకర్ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఇది బ్రేక్ ఈవెన్ కావాలంటే దానికి కనీసం ఒక్క కోటి ఎక్కువగా షేర్ రాబట్టాలి. అంటే కనీసం భోళా శంకర్ సినిమాకు రూ. 81 కోట్ల షేర్ వస్తేనే క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది. ఇక ఎలా చూసుకున్నా రూ. 130, 140 కోట్ల మేర గ్రాస్ రావాలి.

దేనికి ఎంతంటే?: అయితే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు రూ. 89 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సైరా నరసింహా రెడ్డి సినిమాకు రూ. 187 కోట్ల బిజినెస్ అయింది. ఇక రామ్ చరణ్ తో కలిసి నటించి ఆచార్య మూవీకి రూ. 131 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సొంతంగా రిలీజ్: ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ రిలీజైంది. ఆచార్య ఎఫెక్టుతో పలు ఏరియాల్లో గాడ్ ఫాదర్ సినిమాను అమ్మలేదు. నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ సీడెడ్ ఏరియాలో సొంతంగా రిలీజ్ చేశారు. అలాగే కొన్ని ఏరియాలను తెలిసిన వాళ్ల చేత విడుదల చేయించారని ఇన్ సైడ్ టాక్. అలా మొత్తంగా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 90 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

రీమెక్ ఎఫెక్ట్: ఇలా చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అతి తక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ గా భోళా శంకర్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రూ. 80 కోట్ల బిజినెస్ చేసిన భోళా శంకర్ సినిమాకు సుమారుగా రూ. 90 కోట్ల టార్గెట్ ఫిక్స్ అయింది. అన్ని కోట్లు రాబట్టగలిగితేనే క్లీన్ హిట్ తెచ్చుకోగలదు. కానీ, ఇదివరకు లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ కు కలెక్షన్స్ తక్కువగా నమోదు అయ్యాయి. ఇదివరకే ఇతర భాషల్లో చూసిన వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్ కు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











