MSVPG Day 6 Box Office Collections:‘మన శంకరవరప్రసాద్ గారు'ఆల్‌టైమ్ రికార్డ్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ మూవీకి మొదటి నుంచే భారీ అంచనాలతో విడుదలైంది. నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. విడుదలైన తొలి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఆ ఊపు ఆరో రోజు కూడా కొనసాగి బాక్సాఫీస్ వద్ద సినిమా స్ట్రాంగ్ రన్ సాగిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరో రోజు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు రిలీజ్‌కు ముందే అంచనాలకు మించిన క్రేజ్ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రమోషన్స్ జరగడం సినిమాపై బజ్‌ను భారీగా పెంచాయి. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాల్ని కలిపి థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, ఇండియా మొత్తం కలిపితే ఇది రూ.120 కోట్లకు చేరినట్టు సమాచారం.
ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా రూ.280 -300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అయితే పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్‌తో సినిమా వేగంగా సేఫ్ జోన్ దిశగా దూసుకెళ్తుండటం విశేషం.
బాక్సాఫీస్ వద్ద మన శంకర వరప్రసాద్ గారు తొలి వారం అంతా దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రీమియర్ షోలతోనే సినిమాకు మంచి ఊపు వచ్చింది. ఇండియా నెట్‌గా రూ.9.35 కోట్లు రాబట్టి, రిలీజ్‌కు ముందే స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది. ఆ తర్వాత తొలి అధికారిక రోజు అయిన మొదటి సోమవారం రోజున వసూళ్ల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇండియా నెట్‌గా రూ.32.25 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు అయిన మంగళవారం కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజు సినిమా రూ.18.75 కోట్ల నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే సుమారు 41.86 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ ఈ కలెక్షన్లు కూడా వీక్‌డే పరంగా స్ట్రాంగ్ కలెక్షన్లు నమోదైనట్టు ట్రేడ్ చెబుతోంది.
మూడో రోజు బుధవారం మళ్లీ రికవరీ కనిపించడం విశేషం. ఆ రోజు సినిమా రూ.19.50 కోట్ల నెట్ వసూలు చేసి, మంగళవారంతో పోలిస్తే 4 శాతం గ్రోత్ నమోదు చేసింది. నాలుగో రోజు కలెక్షన్లు మరింత బలపడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ స్టెడీగా థియేటర్లకు రావడంతో ఇండియా నెట్ కలెక్షన్ రూ.22 కోట్లకు చేరింది. ఇది ముందు రోజుతో పోలిస్తే 12.82 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఐదో రోజు కలెక్షన్లు మాత్రం కాస్త తగ్గాయి. డే 5 నాడు సినిమా రూ.19.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఇక ఆరోవ రోజు (మొదటి శనివారం) కలెక్షన్స్ పెరిగినట్టు తెలుస్తోంది. ఇతర చిన్న సినిమాలు ఈ మెగాస్టార్ మూవీతో పోటీపడుతున్నా.. తగ్గేలేదే అన్నట్టు దూసుకెళ్తుంది. ఆరో రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 18 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఆరోవ రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 24 -25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం ఆరు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 నుంచి 142 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా.
ఇదిలా ఉండగా, మూవీ మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వారి ప్రకటన ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు తొలి రోజే రూ.84 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, మూడో రోజుకే రూ.150 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటుతూ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపింది. అంతేకాదు, కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది.
అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటిందని మేకర్స్ స్పష్టం చేయడంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం పెరిగింది. చిరంజీవి-వెంకటేష్ కాంబో, అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సినిమాను మరో మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీకెండ్‌లో మరింత భారీ కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications











