Veera Dheera Soora Day 1 Collection: విక్రమ్‌కు దెబ్బేసిన లేట్ రిలీజ్.. దారుణంగా ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే?
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు చియాన్ విక్రమ్. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం , ఇందుకు ఎంత కష్టమైనా ఓర్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. అయితే ఇంత కష్టపడినా ఆయనకు ఫలితం దక్కడం లేదు. చాలా ఏళ్లుగా ఓ హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు విక్రమ్. గతేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తంగలాన్ విక్రమ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో విక్రమ్ నటించిన తాజా చిత్రం వీర ధీర శూర. విడుదలకు ముందే ఎన్నో అవాంతరాలను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
న్యాయపరమైన చిక్కుల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లో మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయ్యాయి. అటు ఓవర్సీస్‌లో పడాల్సిన ప్రీమియర్స్ కూడా రద్దు కావడంతో విక్రమ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. వీర శూర ధీర ఓటీటీ హక్కుల విషయంలో ఏర్పడిన లీగల్ సమస్యలు తీవ్రరూపు దాల్చడంతో పాటు ఏకంగా ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లడమే దీనికి కారణం. ఇక రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన వీర ధీర శూరకు సంబంధించి మొదటి పార్ట్ కాకుండా పార్ట్ 2 ముందుగా థియేటర్‌లలో రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది. దీనిపైనా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాము ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణం ఉందని.. సినిమా చూశాక ఈ విషయం అర్ధమవుతుందని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

వీర ధీర శూరలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. రంజాన్ కానుకగా మార్చి 27న వీర ధీర శూరను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.
టీజర్ , ట్రైలర్, విక్రమ్ లుక్ , ప్రమోషన్ కార్యక్రమాలో వీర ధీర శూర సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విక్రమ్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. విడుదల విషయంలో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు. అడ్వాన్స్ బుకింగ్ బాగానే జరిగినప్పటికీ తొలి రోజు మధ్యాహ్నం వరకు షోలు క్యాన్సిల్ కావడం ఈ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాక్‌నిక్. కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి రోజు వీర ధీర శూర కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దారుణమైన వసూళ్లను అందుకుంది. విక్రమ్ కెరీర్‌లోనే అతి తక్కువగా ఓపెనింగ్స్ రాబట్టింది. తమిళనాడులో రూ.3 కోట్లు, తెలుగులో రూ.20 లక్షల చొప్పున కలెక్షన్లు అందుకోగా.. ఆఫ్ లైన్ లెక్కలు కలుపుకుని రూ.3.50 కోట్లు ఓపెనింగ్స్‌ను ఈ సినిమా రాబట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండో రోజూ వీర ధీర శూర పుంజుకుంటుందని అనుకున్నా.. మోహన్ లాల్ ఎల్ 2 : ఎంపురాన్ , రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ తదితర చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇంతటి టఫ్ ఫైట మధ్య విక్రమ్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











