Coolie AP, TG Business: కూలీ ముందు భారీ టార్గెట్ .. ఎన్ని కోట్లు వస్తే రజనీ మూవీ లాభాల్లోకి అంటే?
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఓటమి ఏరుగకుండా వరుస విజయాలతో ఊపు మీదున్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. క్రైమ్ స్టోరీలతో యాక్షన్+ ఎలివేషన్ మిక్స్ చేసి లోకేష్ చేసే మేజిక్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలాంటి లోకేష్ కనగరాజ్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ జత కలిస్తే.. బాక్స్‌లు బద్ధలే. తలైవాని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో కలలు గంటున్న లోకేష్‌కి ఆ ఛాన్స్ ఇచ్చారు రజనీకాంత్. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రమే కూలీ. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ సినిమా అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా, నైజాంలలో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..
కూలీ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌లు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
కూలీ సినిమా కర్ణాటక హక్కులను ఏవీ మీడియా కన్సల్టెన్సీ దక్కించుకోగా.. నార్త్ ఇండియాలో పెన్ మరుధార్ సొంతం చేసుకున్నారు. కేరళ హక్కులను హాసన్ మీను అసోసియేట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్‌లోనూ కూలీ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ కూలీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను 68 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. నార్త్ అమెరికాలో ప్రత్యంగీరా సినిమాస్, యూకేలో లైట్స్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పోరేషన్, మిడిల్ ఈస్ట్‌లో పరాస్ ఫిల్మ్స్ సంస్థలు కూలీని విడుదల చేస్తున్నాయి. మొత్తం రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ మూవీ భారత్ సహా దాదాపు 100కు పైగా దేశాల్లో రిలీజ్ కానుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
కూలీ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో రజనీ మూవీ థియేట్రికల్ రైట్స్‌పై విపరీతమైన పోటీ నెలకొంది. రజనీ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయని గతంలో పలుమార్లు ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు అయిన ఆసియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్‌రాజులు పోటీపడ్డారు. ఒకదశలో అక్కినేని నాగార్జున సైతం కూలీ రైట్స్ దక్కించుకోవాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ టాప్ ప్రొడ్యూసర్లంతా కలిసి కూలీ రైట్స్ కోసం సన్ పిక్చర్స్‌కు ఫ్యాన్సీ ఎమౌంట్‌ను ఆఫర్ చేశారట. ఈ పోటీలో ఏషియన్ సునీల్‌కు అదృష్టం కలిసొచ్చి కూలీ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 54 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 108 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మరి రజనీకాంత్ ఎలాంటి మేజక్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











