'దరువు' కలెక్షన్స్ పరిస్ధితి ఏమిటి?
రవితేజ తాజా చిత్రం 'దరువు'మొన్న శుక్రవారం విడుదలై మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రవితేజకు ఉన్న క్రేజ్,కామెడీ సినిమా అనే ముద్ర సినిమాను కొంతవరకూ కలెక్షన్స్ పరంగా నిలబెట్టాయి. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ లోనూ బాగానే కలెక్టు చేసింది. అయితే సోమవారం నుంచి చిత్రం కలెక్షన్స్ చాలా చోట్ల పడిపోతూ వస్తున్నాయి. ఈ చిత్రం కన్నా గబ్బర్ సింగ్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు.
ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలను బట్టి ఇప్పటికే ఈ చిత్రం ఓపినింగ్ వీక్ లో దాదాపు తొమ్మిది కోట్లు దాకా కలెక్టు చేసింది. అయితే కలెక్షన్స్ వచ్చే రెండు వారాలు కూడా నిలబడితే సేఫ్ ప్రాజెక్టు అవుతుంది. కానీ పరిస్దితి అలా కనపడటం లేదంటున్నారు. బాలకృష్ణ అధినాయకుడు ఈ వారం రావటంతో దరువు చాలా చోట్ల తీసేస్తున్నారు. అంతేగాక కలెక్షన్స్ పై సైతం అధినాయకుడు ప్రభావం కనపడనుంది.
దాంతో ఈ ప్రాజెక్టు సేఫ్ గా మారే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు. అరవ అతితో కూడిన కామెడీ,రవితేజ మొనాటనీగా అనిపించటం,సెకండాఫ్ సీరియల్ లాగ సాగటం సినిమాకు మైనస్ లుగా మారాయి. సినిమాకి కామెడీ కోసం వెళ్లిన వారు సైతం ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దర్శకుడు శివ తమిళ వాడు కావటంతో తమిళ అతిలాగ సినిమాను బాగా ఓవర్ గా చేసారు. అది సినిమాను బాగా ముంచింది.
అలాగే సినిమా విడుదల అయ్యాక రవితేజ ప్రమోషన్ కి కూడా చాలా దూరంగా ఉంటున్నారు. రవితేజ ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి కూడా రాలేదు. పూరితో చేస్తున్న దేముడు చేసిన మనుష్యులు మీద నమ్మకంగా ఉన్న రవితేజ ఈ సినిమాని పట్టించుకోవటంలేదని వినపడుతోంది. తాప్సీ ఛానెల్స్ చుట్టూ తిరుగుతున్నా పెద్దగా వర్కవుట్ కావటం లేదు. తాప్సీ కెరీర్ లో మొదటి హిట్ గా మిగులుతుందనుకున్న ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











