Dhurandhar 22 days Box Office: 1000 కోట్ల క్లబ్‌లోకి దురంధర్.. ప్రభాస్ రికార్డుపై కన్నేసిన రణ్ వీర్..
Dhurandhar Box Office Collections: బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన యాక్షన్-స్పై థ్రిల్లర్ దురంధర్ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా, తొలి ఆట నుంచే ప్రేక్షకులను అలరించడంతో పాటు వసూళ్ల పరంగా సంచలనంగా మారింది. ఈ సినిమాకి ఆదిత్య ధార్ కథ, కథనం, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించగా, జీ స్టూడియోస్ - బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ యాక్షన్-స్పై థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. 'దురంధర్' భారీ స్కేల్, హై ఎండ్ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ సంగీతం, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ ఈ సినిమాకు మరింత బలాన్ని అందించాయి. ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ అందరూ కలిసి పనిచేయడంతో ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్‌లో తెరకెక్కింది.

ఇక దురంధర్ బడ్జెట్ విషయానికి వస్తే, 'దురంధర్' పార్ట్ 1 ను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఇక ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు రూ.280 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4500 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు పబ్లిక్ డిమాండ్ కారణంగా తర్వాత స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచినట్లు సమాచారం.
ఇండియా బాక్సాఫీస్‌లో 'దురంధర్' తొలి వారం అదరగొట్టింది. మొదటి రోజు రూ.28 కోట్లు, రెండో రోజు రూ.30 కోట్లు, మూడో రోజు రూ.40 కోట్లు, నాలుగో రోజు రూ.24 కోట్లు, ఐదో రోజు రూ.28 కోట్లు, ఆరో రోజు రూ.30 కోట్లు, ఏడో రోజు రూ.30 కోట్లు వసూలు చేసి, తొలి వారం మొత్తంగా రూ.208 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి, బాక్సాఫీస్ ను షేక్ చేసింది. యాక్షన్, ఎమోషన్, స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వారం మధ్యలో కూడా కలెక్షన్లు స్థిరంగా కొనసాగాయి.
ఇక రెండో వారం కలెక్షన్లలో ఈ సినిమా మరింత జోరు చూపించింది. 8వ రోజు రూ.35 కోట్లు, 9వ రోజు రూ.54 కోట్లు, 10వ రోజు రూ.58 కోట్లు, 11వ రోజు రూ.32 కోట్లు, 12వ రోజు రూ.32 కోట్లు, 13వ రోజు రూ.25 కోట్లు, 14వ రోజు రూ.25 కోట్లు వసూలు చేసి, రెండో వారం మొత్తంగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో రెండు వారాల్లోనే దురంధర్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసి సూపర్ హిట్ స్టేటస్‌ను ఖాయం చేసుకుంది.
మూడో వారం కూడా 'దురంధర్' ఏమాత్రం తగ్గుకుండా.. అవతార్ లాంటి ఇంటర్నేషన్ మూవీతో పోటీ పడి, భారీ వసూలు చేసింది. తీవ్రమైన పోటోలో కూడా 15వ రోజు రూ.24 కోట్లు, 16వ రోజు రూ.36 కోట్లు, 17వ రోజు రూ.38.5 కోట్లు, 18వ రోజు రూ.16.5 కోట్లు, 19వ రోజు రూ.17.25 కోట్లు, 20వ రోజు రూ.18 కోట్లు, 21వ రోజు రూ.26 కోట్లు వసూలు చేసింది. ఇలా మూడో వారం మొత్తం రూ.173 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఈ విధంగా 21 రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.634 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మూవీ మేకర్స్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. 21 రోజుల్లో ఇండియా నుంచి రూ.789.18 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.217.50 కోట్లు వసూలయ్యాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1006.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఉన్న పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులను 'దురంధర్' అధిగమించింది. 'స్త్రీ 2' (రూ.598 కోట్లు), 'ఛావా' (రూ.601 కోట్లు) వంటి సినిమాలను దాటేసి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఈ సినిమా విజయం దర్శకుడు ఆదిత్య ధర్ కెరీర్‌లోనే కాకుండా, నటుడు రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక 22వ రోజు కూడా 'దురంధర్' కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. క్రిస్మస్ హాలీడే, వీకెండ్ కలిసి రావడంతో నేటి వసూళ్లు కూడా భారీగా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి డే 22 కలెక్షన్లు కూడా దాదాపు రూ.20 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ జోష్ కొనసాగితే, త్వరలోనే షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.1160 కోట్లు), ప్రభాస్ 'కల్కి 2898 AD' (రూ.1042 కోట్లు) వంటి భారీ సినిమాల రికార్డులను కూడా 'దురంధర్' బ్రేక్ చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, 'దురంధర్ 2' కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్‌ను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'దురంధర్' ఫ్రాంచైజ్ రాబోయే రోజుల్లో బాలీవుడ్‌లో మరో కొత్త రికార్డుల్ని సృష్టించనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











