Dulquer Salmaan : తెలుగు సినిమాలతో దుల్కర్ రేర్ ఫీట్ .. ఏకైక మలయాళ హీరోగా రికార్డ్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ తండ్రి బాటలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం దక్షిణాదిలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. రోటీన్‌కు భిన్నంగా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. కేవలం మలయాళ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దుల్కర్ సినిమాలకు రీసెంట్ డేస్‌లో భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి.
డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్.. మహానటితో బాగా దగ్గరయ్యారు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామంతో తెలుగునాట దుల్కర్ సల్మాన్ ఫ్యాన్ బేస్ పీక్స్‌కి చేరింది. తాజాగా ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాతో దుల్కర్ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు. దుల్కర్ కెరీర్‌లోనే ఈ రేంజ్‌లో రిలీజైన మూవీ ఇదే కావడం విశేషం.
9 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది లక్కీ భాస్కర్. తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, మలయాళంలో రూ. 12 కోట్లు, కన్నడలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కొన్ని ఏరియాలో లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక భారతీయ చిత్రాలకు ఓవర్సీస్ అనేది ఇటీవలి కాలంలో ప్రధాన మార్కెట్‌గా మారిపోయింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, గల్ఫ్ తదితర దేశాల్లో భారీగా స్థిరపడిన ప్రవాస భారతీయులు మన సినిమాలకు మహా రాజ పోషకులుగా మారారు. ఇండియాలో బొమ్మ పడటాని కంటే ముందే అక్కడ ప్రీమియర్ల పేరిట గంటల ముందే సినిమా చూసేస్తున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు . ఇక సినిమా ఏమాత్రం నచ్చిన డాలర్ల వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు సినిమాలకు మంచి ఓవర్సీస్ మార్కెట్ ఉంది. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , నానిల సినిమాలు పలుమార్లు అక్కడ 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేశాయి. తాజాగా ఈ లిస్ట్‌లో దుల్కర్ సల్మాన్ స్థానం సంపాదించాడు. గతంలో ఆయన నటించిన ఓకే బంగారం, మహానటి, సీతారామం తాజాగా లక్కీ భాస్కర్‌లు వరుసగా మిలియన్ మార్క్‌ను క్రాస్ చేశాయి. తద్వారా ఈ రికార్డ్‌ను అందుకున్న ఏకైక మలయాళ హీరోగా దుల్కర్ సల్మాన్ నిలిచారు. ఓ పరభాషా నటుడు మన తెలుగు సినిమాలతో ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించడం సాధారణ విషయం కాదు.


Click it and Unblock the Notifications











