Lucky Baskhar Day 2 Box Office: దుల్కర్ సల్మాన్ ప్రభంజనం..లక్కీ భాస్కర్‌కి రెండో రోజు ఎన్ని కోట్లంటే?
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో అయినప్పటికీ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. తొలుత డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లో పరిచయమైన దుల్కర్‌కి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్‌కు తెలుగు నాట భారీ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. తాజాగా ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్ .. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైంది. తొలిరోజు ఓపెనింగ్స్ రాబట్టిన దుల్కర్ సల్మాన్ రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే .
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ గత సినిమాలు , తెలుగు నాట ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ సినిమాని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీని సుమారుగా 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే కనీసం రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లక్కీ భాస్కర్ రూ. కోటికి పైగా రాబట్టగా.. తొలి రోజున దుల్కర్ సల్మాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వసూళ్ల వేటను ధాటిగా ప్రారంభించింది. ఇక రెండో రోజు లక్కీ భాస్కర్ సాధించిన కలెక్షన్ల వివరాలు చూస్తే .. శుక్రవారం 70 శాతం వరకు ఆక్యూపెన్సీ అందుకున్న ఈ సినిమా .. తెలుగు రాష్ట్రాలు, కేరళలో మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజుతో పోలిస్తే తమిళనాడు, కర్ణాటకలలో లక్కీ భాస్కర్ పుంజుకుంటోంది. రెండో రోజు దుల్కర్ సినిమా తెలుగులో రూ. 5.10 కోట్లు, తమిళ్‌లో రూ. 72 లక్షలు, మలయాళంలో రూ. 1.90 కోట్లు, కన్నడలో రూ. 26 లక్షలు కలిపి మొత్తంగా రూ. 8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











