Lucky Baskhar Day 6 Collections : దుల్కర్ అరాచకం .. 6వ రోజు లక్కీ భాస్కర్‌కు ఎన్ని కోట్లంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే 5 రోజుల్లో దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంపై బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది. వర్కింగ్ డేస్ మొదలైన తర్వాత ఆరో రోజు లక్కీ భాస్కర్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లుగా ఫిలింనగర్ టాక్. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. తమిళ నటుడు రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ గత చిత్రాలు డీసెంట్ హిట్స్ కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది .
ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్‌గా విలువ కట్టారు. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 61.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్‌లో పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక ఆరో రోజు లక్కీ భాస్కర్ కలెక్షన్స్ విషయానికి వస్తే .. మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ బుకింగ్స్ బాగానే జరిగాయని గణాంకాలు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ లక్కీ భాస్కర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ తర్వాత దుల్కర్ సొంత రాష్ట్రం కేరళలోనూ ఈ సినిమా వసూళ్లు బాగున్నాయి. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.84 కోట్లు, తమిళ్‌లో రూ. 72 లక్షలు, మలయాళం రూ . కోటి , కన్నడంలో రూ. 10 లక్షల చొప్పున మొత్తంగా 6వ రోజు దుల్కర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 4.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఏడో రోజైన బుధవారం లక్కీభాస్కర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ఈ వారం వసూళ్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











