'ఇద్దరమ్మాయిలతో' ఎఫెక్ట్...గందరగోళం
హైదరాబాద్: పూరి జగన్నాథ్ తాజాగా రూపొందించిన చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ సినిమాను మే 10న తెర మీదకు తీసుకొస్తామని చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కొద్ది నెలల కిందటే చెప్పారు. అల్లు అర్జున్ 'జులాయి' తర్వాత నటించిన చిత్రం కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు సినీ వ్యాపారుల్లోనూ ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే ఇతర చిత్రాలూ తమ విడుదల ప్రణాళికల్ని సిద్ధం చేసుకొన్నాయి. ఆ తేదీ 24కి వెళ్లింది. ఇప్పుడు మరో వారం వాయిదాపడటంతో చిన్న చిత్రాల విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.
ఈ నెల 17న అయిదు చిత్రాలు మాత్రమే వచ్చాయి. ఈ నెల 24న తెరపైకి క్రేజీ చిత్రాలేవీ రావడం లేదు. ఫలితంగా ఈ వారం కూడా బాక్సాఫీసు కళకళలాడే పరిస్థితి లేదు. స్టార్ హీరో సినిమా మూలంగా పలు చిత్రాలు రావాలా వద్దా అనే సందిగ్ధంలోపడ్డాయి. బన్నీ లాంటి హీరో చిత్రం రిలీజ్ ఉండగా మన చిత్రానికి సరైన థియోటర్స్ దొరకవు అనేది ఒక కారణమైతే, అందరూ పెద్ద సినిమా వైపే చూస్తూంటారనేది మరో కారణం.
ఒక పెద్ద సినిమా విడుదల తరవాత రెండు వారాల విరామం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే తగినన్ని థియేటర్లు కావాలనుకొన్న పక్షంలో మరో వారం వెనక్కి వెళ్లడమే మంచిదని మాకు పంపిణీదార్లు సూచిస్తున్నారు. ఆ దిశగానే ఆలోచన చేస్తున్నామని నిర్మాతలు చెప్తున్నారు.
నరేష్ నటించిన త్రీడీ చిత్రం 'యాక్షన్'. ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలు నెలాఖరున వస్తామని ప్రకటించారు. ప్రచారాన్ని అందుకు తగ్గట్టే జోరుగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాని మరో వారం వెనక్కి తీసుకెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది.
ఐపీఎల్, పెద్ద సినిమాలన్నీ వెళ్లిన తరవాత మా 'ప్రేమ కథా చిత్రమ్'ని చూపిస్తామని మారుతి తెలిపారు. అందుకు తగ్గట్టే జూన్ 7న విడుదల చేయాలనుకొన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితులు ఆ చిత్ర వర్గాలని పునరాలోచనలోపడేశాయని తెలిసింది. ఇక శ్రియ నటించిన 'పవిత్ర' విడుదల విషయంలోనూ స్పష్టత రాలేదు. ఛార్మి వేశ్యగా నటించిన సినిమా 'ప్రేమ ఒక మైకం' వచ్చే నెల 7న వస్తుందనుకొన్నారు.


Click it and Unblock the Notifications











