Empuraan Day 2 Collections: చరిత్ర సృష్టించిన ఎంపురాన్.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మలయాళంలో తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందిన L2: ఎంపురాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో జైత్రయాత్రను ప్రారంభించింది. లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనే వసూళ్ల పరంగా సత్తా చాటుతున్నది. ఈ సినిమా కేరళ సినీ రంగంలో సరికొత్త చరిత్రను రాసేందుకు సిద్దమవుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాలు ఏమిటి అనే విశేషాల్లోకి వెళితే..
సౌత్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించారు. ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి, అఖిలేష్ మోహన్ ఎడిటింగ్, దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు.

లూసిఫర్ 2 సినిమాను మలయాళ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాకు టాప్ లెవెల్ టెక్నిషియన్స్, హాలీవుడ్ నటీనటులు వర్క్ చేయడంతో బడ్జెట్ పరంగా అధికంగానే అయిందని నిర్మాత దిల్ రాజు ఇటీవల హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్ల రూపాయలు, కేరళలో తొలి భారీ బడ్జెట్ చిత్రమని ఆయన వెల్లడించారు.
ఎంపురాన్ సినిమాను పలు భాషల్లో ప్రముఖ పంపిణీదారులు ఈ సినిమాను రిలీజ్ చేశారు. కేరళలో గోకుళం ఫిలింస్, కన్నడలో హోంబలే ఫిలింస్, హిందీలో అనిల్ తడానీ లాంటి వ్యక్తులు కమిషన్ బేస్ మీద రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇండియన్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రూపాయలుగా, ఓవర్సీస్ కలెక్షన్లు 30 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టినట్టు వెల్లడించారు. దాంతో ఈ సినిమా 110 కోట్ల నికరంగా, 220 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు.
ఎంపురాన్ మూవీ అన్ని భాషల్లో రికార్డు వసూళ్లు సాధించింది. తొలి రోజున మలయాళంలో 20 కోట్ల రూపాయలు నికరంగా, తెలంగాణ, ఏపీలో 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.1 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సాక్ నిల్క్ వెబ్‌సైట్‌తోపాటు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మొత్తంగా తొలి రోజు 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక మోహన్ లాల్ నటించిన ఈ సినిమా రెండో రోజున కూడా గ్రాండ్‌గా వసూళ్లను నమోదు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. కేరళలో ఈ చిత్రం 2వ రోజున 7 కోట్లకుపైగా వసూళ్లను, తెలుగులో ఈ చిత్రం 1 కోటి రూపాయలు, కన్నడలో 2.5 కోట్లు, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని వెల్లడించారు. దాంతో ఈ సినిమా 2వ రోజు 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువై 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











