F3 movie day 5 collections కలెక్షన్లు నేలచూపే.. బాక్సాఫీస్ వద్ద పనిచేయని F3 మ్యాజిక్
టాలీవుడ్‌లో డివైడ్ టాక్‌తో ముందుకెళ్తున్న చిత్రం F3. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను భారీగా థియేటర్‌కు రప్పించలేకపోతున్నదనే విషయం వసూళ్లు తెలియజేస్తున్నాయి. F2 మూవీ క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తే.. నాసిరకం, జబర్దస్త్ కంటే దారుణమైన వినోదం కారణంగా F3 చిత్రం కాసులు వర్షం భారీగా కురిపించలేకపోతున్నదనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇలాంటి అంశాల మధ్య F3 చిత్రం 5వ రోజు ఎంత వసూలు చేసిందంటే..

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?
F3 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల అవుట్ రైట్‌కు హక్కులు అమ్మడం జరగగా.. మరొకొన్ని చోట్ల సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వాల్యూను విడుదలకు ముందు 64 కోట్లుగా అంచనా కట్టారు. అయితే దాంతో 65 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

ఓవర్సీస్‌లో అంతంత మాత్రమే
టాలీవుడ్‌లో సీరియస్ సినిమాల రిలీజ్ తర్వాత వినోదం ప్రధానంగా వచ్చిన F3 మూవీకి ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్ ఉంటాయని ఆశించారు. కానీ తొలి రెండు, మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్లను సునాయసంగానే వసూలు చేసింది. అయితే ఆ తర్వాత ఓవర్సీస్ కలెక్షన్లలో ఎదుగుదల కనిపించకపోవడంతో రిలీజ్‌కు ముందు అంచనా వేసిన 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకోవడం కష్టమే అనిపిస్తున్నది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 6.15 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో
F3 మూవీ గత నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లను ఇలా రాబట్టింది. తొలి రోజున 10.35 కోట్లు, రెండో రోజున 8.35 కోట్లు, మూడో రోజున 8.85 కోట్లు, నాలుగో రోజున 4.68 కోట్లు వసూలు చేసింది. దాంతో నాలుగు రోజుల్లో 32 కోట్లకుపైగా షేర్.. 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

నైజాం, ఏపీలో 5వ రోజు వసూళ్లు
F3 మూవీ కలెక్షన్లు నాలుగో రోజున 50 శాతానికి పైగా క్షీణించాయి. అయితే 5 రోజున కూడా అదే డ్రాప్ కనిపించింది. వర్కింగ్ డేస్‌లో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించలేకపోయింది. దాంతో నైజాంలో 1.08 కోట్లు, సీడెడ్‌లో 52 లక్షలు, ఉత్తరాంధ్రలో 54 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 28 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షలు, గుంటూరు జిల్లాలో 22 లక్షలు, కృష్ణా జిల్లాలో 20 లక్షలు, నెల్లూరు జిల్లాలో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 కోట్లకుపైగా షేర్. 5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా F3 మూవీ ఐదు రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 35.30 కోట్ల షేర్, 56.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.34 కోట్లు గ్రాస్, ఓవర్సీస్‌లో 6.15 కోట్లు వసూలు చేసింది. దాంతో 43.81 కోట్ల షేర్, 73 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావాలంటే
F3 మూవీ రాబట్టిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. భారీగానే వసూలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. 65 కోట్లకు గాను.. ప్రస్తుతం 43 కోట్లు రాబట్టింది. అయితే ఇంకా ఈ చిత్రం 22 కోట్ల రూపాయాల మేర వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











