దేవర, పుష్ప 2 ఫేక్ కలెక్షన్లా? సంక్రాంతికి వస్తున్నాం మీట్‌లో డిస్టిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు
ఏదైనా కొత్త సినిమా రిలీజైతే దానికి సంబంధించిన లెక్కలన్నీ నిర్మాత దగ్గర చిట్టా ఉంటుంది. కానీ కొందరు అభిమానులు తమ హీరోని, తమ తోటి ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేందుకు గాను భారీ వసూళ్లు సాధించినట్లుగా పోస్టర్లు వేస్తుంటారు. విడుదలకు ముందే మార్కెట్‌లో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు రికార్డ్ ఓపెనింగ్స్ కొడితే ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు కూడా పట్టించుకోవు. కానీ హైప్ లేని సినిమాలకీ, మిక్స్‌డ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఊహించని నెంబర్స్‌తో ఇలాంటి పోస్టర్లు ప్రకటిస్తుండటంతో అదే పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఈ సంక్రాంతికే వచ్చిన రామ్ చరణ్ - శంకర్‌ల గేమ్ ఛేంజర్ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చినట్లుగా పోస్టర్ వదలడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ ఎలా సాధ్యం? ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదే కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేక్ కలెక్షన్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంక్రాంతికి హిట్‌గా నిలవడంతో పాటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు ఇలా అందరికీ మూడు రోజులు తిరిగేసరికి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. సినిమా హిట్ అయితే నిర్మాత, హీరోలు పార్టీలు ఇచ్చేవారు.. ఇప్పుడు రోటీన్‌కు భిన్నంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు.. సంక్రాంతికి వస్తున్నాం హిట్ నేపథ్యంలో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌కు పార్టీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తనకు పెద్ద పాఠం నేర్పిందని, గత నాలుగైదేళ్లుగా తడబడుతున్నామని.. బడ్జెట్ కాదు కథే ముఖ్యమని అర్ధమైందని దిల్‌రాజు తెలిపారు. పడిపోతున్న మమ్మల్ని ఈ సినిమాతో అనిల్ మరోసారి పైకి తీసుకొచ్చాడని.. పదేళ్ల పాటు తమకు ఎలాంటి ఢోకా లేదని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమా బ్రేక్ ఈవెన్ అయితేనే హిట్ అని చెప్పుకుంటున్న పరిస్ధితులు ఇండస్ట్రీలో ఉన్నాయని దిల్‌రాజు తెలిపారు.
వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సూపర్ హిట్ పోస్టర్లు పడుతుంటాయని, ఏరియాల వారీగా ఆరా తీస్తే మాకు ఇంత పోయిందని చెబుతుంటారని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తిగా మారిపోయిందని, ఏరియాకు ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలితే గొప్ప అనే పరిస్ధితి వచ్చిందని దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం ఫెయిల్యూర్స్ ఉంటే 10 శాతం మాత్రమే మిగులుతుందని, అందరికీ ఆ పది శాతమే కనిపిస్తుంది తప్పించి 90 శాతం ఎవరికీ కనిపించదని దిల్‌రాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన దేవర , అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలకు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎల్‌వీఆర్ ఫేక్ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి ఓ గుణపాఠం నేర్పించారని.. కంటెంట్ ముఖ్యమని, 200 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదన్నారు. సినిమాలు ఫ్లాప్ అయినా మేం బయటికి మాట్లాడకూడదని, మేం డబ్బు పొగొట్టుకుని కూడా పొగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితని ఎల్‌వీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేం నిజాలు మాట్లాడితే.. మాకు నెక్ట్స్ పిక్చర్ ఇవ్వరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











