Gabbar Singh Re Release : చిరు, మహేశ్‌ల రికార్డులకు పవన్ ఎసరు.. ఓవర్సీస్‌లో గబ్బర్ సింగ్ కలెక్షన్ల ఊచకోత
పవన్ కళ్యాణ్ జన్మదినం అంటే అభిమానులకు పండుగ రోజు. అందులోనూ ఈ ఏడాది వారికి మెమొరబుల్. పదేళ్ల పోరాటం ఫలించి పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తను గెలవడంతో పాటు పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈసారి ప్రభుత్వంలోనూ భాగమై డిప్యూటీ సీఎంగా తన మార్క్ చూపిస్తున్నారు. అలా రాజకీయ నాయకుడిగా పవన్ కెరీర్‌లో 2024 చిరస్థాయిగా నిలిచిపోతుంది. జనసేనాని చారిత్రక విజయం తర్వాత వస్తున్న తొలి పుట్టినరోజు కావడంతో దీనిని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేయాలని చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన గబ్బర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ప్రకటించారు. పవర్‌స్టార్ సినీ కెరీర్‌లోనే గబ్బర్ సింగ్‌కు ప్రత్యేక స్థానముంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవర్‌స్టార్‌కు తిరిగి విజయాన్ని అందించడంతో పాటు ఆయనను రేసులో నిలబెట్టింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

దర్శకుడు త్రివిక్రమ్ సూచన మేరకు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హిందీలో నటించిన దబాంగ్ మూవీ తెలుగు రీమేక్ రైట్స్‌ని బండ్ల గణేష్ కొనుగోలు చేశారు. ఈ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దర్శకుడిగా హరీష్ శంకర్‌కు ఛాన్స్ దొరికింది. అసలే పవన్‌కు వీరాభిమాని అయిన డైరెక్టర్.. ఆయనను ఫ్లాపుల్లోంచి బయటపడేయాలని కసితో గబ్బర్ సింగ్ తీశారు. ఈ మూవీలోని పాటలు, డైలాగ్స్, పవన్ మేనరిజం ఆయన అభిమానులను ఒక ఊపు ఊపాయి.
మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజైన గబ్బర్ సింగ్ సంచలన విజయం నమోదు చేసింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు... 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది. అలాంటి గబ్బర్ సింగ్‌ను 4కే వెర్షన్‌లో సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తుండటంతో పవర్‌స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రెగ్యులర్ రిలీజ్ మాదిరే థియేటర్లను ముస్తాబు చేసి బ్యానర్లు, కటౌట్లతో నింపేశారు.
రీ రిలీజ్ డేట్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో గబ్బర్ సింగ్ కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ప్రీ సేల్స్ ద్వారా వరల్డ్ వైడ్‌గా రూ.3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు పవన్. బుక్ మై షోలో రెండ్రోజుల క్రితమే లక్షకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికాలో గబ్బర్ సింగ్ దుమ్మురేపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి నాటికి 113 లోకేషన్లలో స్పెషల్ షోలు పడగా.. 58,184k డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. చూస్తుంటే రీ రిలీజ్‌ల విషయంలో చిరంజీవి ఇంద్ర, మహేశ్ బాబు మురారి రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పే దిశగా గబ్బర్ సింగ్ దూసుకెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications











