గంగ యూనిట్ విజయోత్సాహం
మైత్రీ కళామందిర్ పతాకంపై శేఖర్ యలమంచి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించిన గంగ చిత్రం యూనిట్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉంది. పల్లెటూళ్లలో ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతున్న జోగినీ (కొన్ని ప్రాంతాల్లో మాతంగి, రాయలసీమలో బసవిని) దురాచారాన్ని ఎండగొడుతూ రూపొందించిన ఈ చిత్రానికి ఆశించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం ఆ చిత్ర యూనిట్‌కు ఆనందం కలిగిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శేఖర్ యలమంచి మాట్లాడుతూ పల్లెలను నమ్ముకొనే నేను గంగ చిత్రాన్ని నిర్మించాను. ఇందులో మేం చర్చించిన సాంఘిక దురాచారం ఇప్పటికీ కొన్ని పల్లెల్లో కనిపిస్తుంది. అందుకని ఈ సినిమా పట్టణాల వారికంటే పల్లెవాసులనే ఎక్కువగా ఆకట్టుకుంటుందని భావించాం. మా నమ్మకం వమ్ముకాలేదు. ఈ చిత్రాన్ని మహిళలు ఎక్కువగా ఆదరిస్తారని అనుకున్నాం. వారితో పాటు యువత కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. నకిరేపల్లి అనే గ్రామంలో ఈ చిత్రాన్ని తామే విడుదల చేస్తామని కొంతమంది యువకులు ముందుకు రావడం ఆనందం కలిగించింది అని చెప్పారు.
ఈ చిత్రంలో గంగగా రేణుక, రంగసానిగా ఈశ్వరి, మరొక ప్రత్యేక పాత్రలో జాతీయ ఉత్తమ నటి తార (కన్నడ) నటించారు. వర్ధమాన నటుడు వేణుగోపాల్ కథానాయకుడు. శేఖర్ మిత్రుడు అందెశ్రీ రాసిన ఒక పాట విని స్ఫూర్తి పొంది దానికి కథారూపం కల్పించి, తొలి ప్రయత్నమైనా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ యలమంచి ధన్యజీవి అని ఆ చిత్ర యూనిట్ సభ్యులు కొనియాడుతున్నారు. గంగలో ఒక కీలకమైన పాత్ర పోషించిన రంగనాథ్ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు, సాహితీవేత్తలకు పిలుపునిస్తూ ఈ చిత్రం చూడటం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు.
కోటి స్వరపర్చిన బాణీలు ఇప్పటికే పల్లెప్రాంతాలలో ప్రాచుర్యం పొందాయి. ఒక మంచి చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఈ చిత్రం రుజువు చేసిందని మరొక పాత్రధారి దువ్వాసి మోహన్ అన్నారు. గంగ చిత్రం శేఖర్‌కు కన్నబిడ్డ లాంటిదని, ఇప్పుడు అది అందరి ఆదరణ పొందుతుండటానికి కారకులైన దర్శక-నిర్మాత శేఖర్ ఇటువంటి సామాజిక రుగ్మతను నిర్భీతిగా తెరకెక్కించి ధన్యజీవి అయ్యారని కొనియాడారు.


Click it and Unblock the Notifications