Rama Banam Collections: రామబాణంకు కోలుకోలేని దెబ్బ! ఎత్తేస్తున్న థియేటర్లు? భారీగా తగ్గిన వసూళ్లు
ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా తొలివలపు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన గోపీచంద్ తర్వాతి కాలంలో విలన్ గా అద్భుతమైన నటనతో అలరించాడు. తర్వాత యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ మ్యాచో హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
హిట్లు ప్లాప్ లు చేస్తూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ కు సినిమా వసూళ్లు నిరాశనే మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ఇలా ఈ సినిమాకు నాలుగో రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

బాలయ్య సలహాతో: డస్కీ బ్యూటి డింపుల్ హయాతి హీరోయిన్ గా గోపీచంద్ సరసన జోడీ కట్టిన మూవీ రామ బాణం. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 వేదికగా సజ్జెస్ట్ చేసిన ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. అలా మే 5న విడుదలైన ఈ సినిమాకు టాక్ మాత్రం సోసోగా ఉంది.

ప్రీ రిలీజ్ బిజినెస్: రామ బాణం చిత్రానికి తెలుగు రాష్ట్రాలైన నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్లతో మొత్తంగా రూ. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు ఇవన్నీ కలుపుకుని మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 14.50 కోట్ల బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 15.20 కోట్లుగా ఫిక్స్ అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ: రామబాణం మూవీని మరి రొటీన్ కథతో డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే టేకింగ్, డైరెక్షన్ కూడా అంతగా ఆకట్టుకోవట్లేదని టాక్. ఇలాంటి టాక్ నడుస్తున్న నేపథ్యంలో రామబాణం 4వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీని చూస్తే.. ఉదయం 11.82 శాతం, మధ్యాహ్నం 15.53 శాతం సాయంత్రం 15.53 శాతంగా నమోదు అయింది. ఇది చూస్తుంటే గత మూడు రోజులతో పోలిస్తే 4వ రోజు తక్కువగానే నమోదు అయింది.

4వ రోజు కలెక్షన్స్: టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన రామబాణం సినిమాకు పాజిటివ్ కు బదులు నెగెటివ్ టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సినిమా నాలుగో రోజున రూ. 60 లక్షల నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే రాబట్టనుందని అంచనా. ఇదే జరిగితే తొలి 3 రోజులతో పోలిస్తే ఇదే అతి తక్కువ వసూళ్లు. ఇక 4 రోజుల్లో రూ. 5.61 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నాయని సమాచారం.

ఎత్తేస్తున్న థియేటర్లు: రామబాణం సినిమాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 840 థియేటర్లలో విడుదల చేశారు. కానీ ఈ సినిమాకు వస్తున్న నెగెటివ్ టాక్ మూలంగా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో థియేటర్లలో షోలు క్యాన్సిల్ చేస్తున్నారని సమాచారం. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే భారీగా థియేటర్లలో మూవీని ఎత్తేస్తున్నారని టాక్. ఇదే నిజమైతే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవడం పక్కన పెడితే నిర్మాతలకు భారీ నష్టం కలిగినట్లే.


Click it and Unblock the Notifications











