Viswam Day 2 Collections : ఫస్ట్ డేకి మించి కుమ్మేసిన విశ్వం... రెండో రోజు గోపీచంద్ మూవీకి ఎన్ని కోట్లంటే?
దర్శకుడు శ్రీనువైట్ల, హీరో గోపిచంద్‌లు హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా శ్రమిస్తున్నా గెలుపు అందడం లేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు వీరిద్దరూ. అలాంటి శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబోలో వచ్చిన సినిమాయే విశ్వం. గతంలో యాక్షన్, థ్రిల్లర్స్ ట్రై చేసి చేతులు కాల్చుకున్న శ్రీను వాటి జోలికి వెళ్లకుండా తనను స్టార్ డైరెక్టర్‌ను చేసిన కామెడీతో నరుక్కొద్దామని ఫిక్స్ అయ్యారు. అదే విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే స్థాయికి తగ్గ ఓపెనింగ్స్ అందుకున్న గోపీచంద్.. సెకండ్ డే ఎన్ని కోట్లను రాబట్టాడో చూస్తే :
విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

గత సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా.. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్ అనే సరికి టాలీవుడ్ జనాలకు కొత్తగా అనిపించింది. టీజర్ , ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విశ్వం సినిమా నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల బిజినెస్ చేశాయి. అంటే వరల్డ్ వైడ్‌గా రూ.11. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి రూ.12.5 కోట్ల షేర్, దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే విశ్వం సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైన విశ్వం సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు దసరా పండుగ కావడంతో బుకింగ్స్ బాగానే జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొదటి రోజు దాదాపు 28 వేలకు పైగా టికెట్స్ అమ్ముడవ్వగా.. ఈ సంఖ్య రెండో రోజు మరింత పెరిగినట్లు ట్రేడ్ పండితులు అంటున్నారు. రెండో రోజు గోపీచంద్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గోపీచంద్ గత చిత్రం భీమాతో పోల్చితే విశ్వం ఓపెనింగ్స్ తక్కువగానే వచ్చినప్పటికీ దసరా సీజన్ కావడంతో ఒడ్డున పడతామని చిత్ర యూనిట్ భావిస్తోంది. రెండు రోజుల్లో విశ్వం మూవీ రూ.5 కోట్ల వరకు షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో రూ.8 కోట్ల వసూళ్లు అందుకోవాల్సి ఉంది. ఆదివారంతో పండగ సెలవులు, వీకెండ్ ముగుస్తుంది.. వర్కింగ్ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌ను బట్టి విశ్వం రిజల్ట్ ఆధారపడి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











