Governor Movie Review: గవర్నర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మనోజ్ బాజ్‌పేయ్, అదా శర్మ, నషాద్ మహ్మద్ కుంజు, మధు శర్మ, ప్రీతోష్ సంద్ తదితరులు
దర్శకత్వం: చిన్మయి డీ మండ్లేకర్
నిర్మాత: విపుల్ అమృత్‌లాల్ షా
సినిమాటోగ్రఫి: విశాల్ సిన్హా, మేఘ్న మంచందా సేన్, సంజయ్ శర్మ
మ్యూజిక్: అమిత్ త్రివేది
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మన్నన్ షా
రిలీజ్ డేట్: 2026-06-12
తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామన్ (మనోజ్ బాజ్‌పేయ్) నిజాయితీ పరుడైన ఆఫీసర్. దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న 1990 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున నిలుస్తుంది. ఆ సమయంలో RBI (రాష్ట్రీయ బ్యాంక్ ఆఫ్ ఇండియా) డిప్యూటీ చైర్మన్ సీఆర్‌ను కాకుండా రామన్‌ను చైర్మన్‌గా అప్పటి ప్రధాని శేఖర్ నియమించడంతో అన్ని వర్గాలు ఆశ్చర్యానికి గురవుతారు. కనీస అర్హత లేని రామన్‌ను ఇంత పెద్ద పదవిలో ఎలా నెట్టుకు వస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతుంది. అమెరికా, ఇరాక్ యుద్దం ప్రభావం భారత్‌పై దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) సంస్థ నుంచి 2 బిలియన్ డాలర్ల అప్పుకు ప్రయత్నిస్తారు. ఇతర దేశాల నుంచి రుణాల సేకరణకు ప్రయత్నిస్తాడు రామన్. చివరకు భారత్ వద్ద ఉన్న బంగారు నిల్వలను స్విస్ బ్యాంక్, లండన్ బ్యాంక్‌కు గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెడుతారు.

1990 సంవత్సరంలో దేశం పరిస్థితి ఎలా ఉండేది? ఎలాంటి పరిస్థితిలో రామన్‌ను ఆర్బీఐ చైర్మన్‌గా నియమించారు? రామన్‌కు ఆర్బీఐలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రామన్‌పై పెరిగిన రాజకీయ ఒత్తిడి ఏ రేంజ్‌లో ఉండేది? రాజీవ్ గాంధీ హత్య సంఘటన దేశాన్ని ఎలా కుదిపేసింది? ప్రధాని శేఖర్ రాజీనామా తర్వాత రామన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విదేశీ రుణాన్ని సేకరించడానికి రామన్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? బంగారు నిల్వలను సీక్రెట్‌గా తాకట్టు పెట్టడానికి కారణం ఏమిటి? దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో మీడియా పాత్ర ఏమిటి? రాజకీయ, మీడియా, సొంత సంస్థలో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకొని రామన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారనేది ఈ సినిమా కథ.
శ్రీలంక దేశం ఆర్థికంగా దివాళా తీసిన నేపథ్యంతో గవర్నర్ సినిమా ఎమోషనల్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. ఈ తరం యువతకు ఆర్థిక మాంద్యంపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో జాతీయ మీడియాలో రిపోర్టర్‌గా పనిచేసిన మిస్ వర్మ (అదాశర్మ) 1990 సంవత్సరంలో భారత్ ఎదుర్కొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను నేటి యువతకు చెప్పడం ద్వారా కథ ఫ్యాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్తుంది. దేశంలో ఆర్థిక విధానాలు అస్తవ్యస్తంగా మారడంతో ఆదాయం తగ్గి అప్పలుు పెరిగిపోవడం ద్వారా దేశం దివాళా దశకు చేరుకోవడమనే విషయాలు కాస్త డాక్యుమెంటరీ తరహా సాగినప్పటికీ.. రామన్‌గా మనోజ్ బాజ్‌పేయ్ నిజాయితీతో కూడిన నటన కారణంగా సినిమా ఎంగేజింగ్‌గా మారుతుంది. ఫస్టాఫ్ సినిమా నెమ్మదిగా, సాగదీసినట్టుగా కమర్సియల్ వాల్యూస్ లేకుండా కేవలం కథ డిమాండ్ చేసిన సన్నివేశాలనే దర్శకులు చిన్మయి చూపించిన తీరు బాగుంటుంది.
గవర్నర్ సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫ్యూన్ కూతురు ఐఏఎస్ కావడం, బంగారం నిల్వలను విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టడం లాంటి అంశాలు ఆసక్తికరంగాను, భావోద్వేగంతోను కొనసాగుతాయి. నేటి తరం యువతకు భారత్ ఎలాంటి పరిస్థితులను తట్టుకొని ప్రస్తుతం సుసంపన్నమైన దేశాల్లో ఒకటిగా ఎలా నిలిచింది అనే విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్పారనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అప్పటి ఆర్బీఐ చైర్మన్ వెంకటరామనన్ అనధికార బయోపిక్‌గా ఈ సినిమా కనిపిస్తుంది. కొంత మేరకు నేటి రాజకీయ పార్టీల ప్రభావం ఈ సినిమా కథ, సన్నివేశాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న చిత్రమే అని చెప్పాలి.
కాళ్ల కింద భూమి బద్దలవుతున్నా.. కొండ విరిగి మీద పడుతున్న పరిస్థితుల్లో రామన్ చాలా కామ్‌గా రామన్ వ్యవహరించే తీరు, హావభావాలను మనోజ్ బాజ్‌పేయ్ చక్కగా పలికించారు. సహజ నటన, హుందాతనంగా కనిపించే బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొంటారు. మనోజ్ ప్రతీ సన్నివేశంలోను అద్బుతంగా కనిపిస్తారు. చిన్న నటులు కూడా ఫ్రేమ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనోజ్ ఎలా తోడ్పాడ్డారో అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. బిజినెస్ రిపోర్టర్‌గా అదా శర్మ తన పాత్రను పర్వాలేదనిపించారు. ఆమె నటించడానికి ఒకట్రెండు సీన్లు తప్పా.. పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. రామన్ భార్యగా రోజా ఫేమ్ మధుబాల తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. మిగితా నటీనటులు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫికి పెద్దగా స్కోప్ లేని సినిమా. ఆఫీస్, ఇంటిలో జరిగే డైలాగ్ డ్రామా కావడంతో పెద్దగా సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి స్కోప్ లేకపోయింది. కానీ పాత్రలు డెలివరీ చేసే యాక్షన్, మూడ్, సన్నివేశాలకు కావాల్సిన వాతావరణాన్ని చక్కగా క్యాప్చర్ చేశారు. ఆర్ట్ విభాగం పనితీరు చాలా బాగుంది. అమిత్ త్రివేది పాటలు సందర్బోచితంగా ఫర్వాలేదనిపిస్తాయి. మన్నన్ షా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు అనుగుణంగా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాత్రల్లో ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పాత్రలకు ఊరు పేరు లేని నటులను ఎంపిక చేయడం ద్వారా ఆ క్యారెక్టర్లు తేలిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చే పొలిటికల్, ఫైనాన్షియల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. థియేటర్‌లోనే ట్రై చేయండి.


Click it and Unblock the Notifications