Gymkhana Collections: 3 రోజుల్లోనే జింఖానా బ్రేక్ ఈవెన్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అలపుజా జింఖానా సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తున్నది. ప్రేమలు ఫేమ్ నెల్సన్, లక్మణ్ అవరన్, గణపతి, షైన్ టామ్ ఛాకో, కొట్టాయం నజీర్ నటించిన ఈ సినిమాకు ఖాలీద్ రెహ్మాన్ రచించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఖాలీద్ రెహ్మన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సబీష్ కన్నన్ చెర్రీ నిర్మించారు. ఈ సినిమా గత 6 రోజులుగా వసూళ్లను భారీగా రాబడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అలపుజా జింఖానా సినిమాకు జిమిషి ఖాలీద్ సినిమాటోగ్రఫి, విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు నిషద్ యూసఫ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రిలీస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించాయి. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 10 కోట్ల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మలయాళంలోను, సుమారుగా 2 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే మలయాళ వెర్షన్‌లో ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన కేరళతోపాటు ఓవర్సీస్‌లో రిలీజ్ కాగా, తెలుగులో ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ స్పందనను కూడ గట్టుకొన్నది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ ఆక్యుపెన్సీతో ముందుకెళ్తున్నది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి స్కీన్ల సంఖ్యను పెంచడం విశేషంగా మారింది. ఇటీవల ఘన విజయం సాధించిన ప్రేమలు సినిమాకు మించిన లాభాలను ఈ సినిమా సాధించిపెట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మలయాళంలో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. మమ్ముట్టి నటించిన బజూకా సినిమాను వెనక్కి నెట్టి రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలి వారం ఈ సినిమా కేరళలో 21 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, ప్రస్తుతం మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. ఈ సినిమా కేరళలో 38 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.
ఇక తెలుగులో జింఖానా పేరుతో రిలీజై యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 3 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ వికెండ్‌లో సాధించిన వసూళ్ల కంటే ప్రస్తుతం ఎక్కువగా వసూళ్లను రాబడుతున్నది. గత మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

జింఖానా సినిమా ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 3.5 కోట్లు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా 70 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చి ఈ సినిమా నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు భారీ లాభాలను పంచడంపై ట్రేడ్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











