సంక్రాంతి దాకా హ్యాపీడేస్ హవానే కొనసాగుతుందని ముందే ప్రకటించిన దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల మాట నిజమైంది. ఇప్పటికి కూడా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో తనకెదురులేదని 100 రోజుల వైపుకు దూసుకెళుతోంది. సెలవు రోజులలో టికెట్లింకా బ్లాక్ లో అమ్ముడవుతున్నాయంటే హ్యాపీడేస్ సినిమా జనాలను ఎంత ఆకట్టుకుంటోందో అర్థం అవుతోంది. క్రిస్మస్ పండగ రోజు ఫస్ట్ షో కు టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారంటూ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు దేవి థియేటర్ మేనేజర్ తో గొడవకు దిగడమే ఇందుకు సాక్ష్యం. గురువారానికి 86 రోజులకు చేరుకున్న హ్యాపీ డేస్ ను కొత్త సినిమాలెన్ని విడుదలైనా ఏమీ చేయలేకపోతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలేవీ హ్యాపీడేస్ హవాను అడ్డుకోలేకపోతున్నాయి.