Hari Hara Veera Mallu Business: హరిహర వీరమల్లుకి రికార్డు బిజినెస్.. తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో జూలై 24న విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ వైపు.. మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాల విషయాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనేక దఫాలు వాయిదా పడటంతో ఈ మూవీ రిలీజ్ అవుతుందా? కాదా? అనే అనుమానాలు అభిమానుల్లో బలంగా నాటుకుపోయాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్‌లో నమ్మకం, ధైర్యం కుదిరింది. ఈ మూవీ ట్రైలర్ మూవీపై అంచనాలు, సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్‌కు ముస్తాబు చేస్తూనే ఈ మూవీ బిజినెస్ కార్యక్రమాలను నిర్మాత ఏఎం రత్నం ముగించేస్తున్నారు. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్ల కారణంగా బిజినెస్ జరపడం చాలా కష్టంగా మారింది. మాకు ఉన్న బలహీనతలను కొందరు డిస్టిబ్యూటర్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. చాలా తక్కువ ధరకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు. కానీ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని నిర్మాత చెప్పారు.
అయితే ఈ సినిమా ఏపీ, నైజాం హక్కులు బిజినెస్ పూర్తి అయింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అమ్మకం భారీగానే ముగిసాయి. ఏపీలోని ఆరు ప్రాంతాల హక్కులు సుమారుగా 50 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఈ సినిమా సీడెడ్ రైట్స్ దాదాపు 16 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక నైజాం హక్కులు మాత్రం 40 కోట్లకుపైగానే వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 100 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్‌ను ఓవర్సీస్‌లో మొదలుపెట్టారు. ఈ సినిమాకు భారీగా స్పందన కనిపిస్తున్నది. అలాగే నార్త్ అమెరికాలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నదని ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. ఇక ఒక రోజుముందుగా ప్రదర్శించే ప్రీమియర్ షోలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











