Harihara Veeramallu Andhra Nizam Collection: హరిహర వీరమల్లు 2 రోజుల కలెక్షన్లు.. ఆంధ్రా, నైజాంలో ఎన్ని కోట్లు?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథా నాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

కరోనా లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా మొదలైంది. అనేక పర్యాయాలు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దలీప్ తాహిల్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, విదేశాల్లో వీఎఫ్ఎక్స్ ఖర్చులు, ప్రమోషన్స్ కారణంగా నిర్మాణ వ్యయం భారీగా అయింది. ఈ సినిమా ఫైనల్ బడ్జెట్‌గా పవన్ కల్యాణ్ పారితోషికం మినహాయించి 250 కోట్లుగా తేల్చారు.
పవర్ స్టార్ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావవరి జిల్లా 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర జరిగింది. 104 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్ల బాక్సాఫీస్ జర్నీని భారీగా మొదలుపెట్టింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 12.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు ఈ చిత్రం ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో 40.65 కోట్లు షేర్, 54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో నైజాంలో 12.4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 28 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అలాగే మిక్స్‌డ్ రివ్యూల కారణంగా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఈ సినిమా రెండో రోజు ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో 9 కోట్ల రూపాయల షేర్, 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల రూపాయలు షేర్, 69 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











