హీరో నితిన్ ఫ్యామిలీ చేతికి కమల్ హాసన్ మూవీ.. భారీ రేటుకు శివకార్తికేయన్ తెలుగు రైట్స్
తెలుగు మార్కెట్‌పై డబ్బింగ్ చిత్రాలతో దండెత్తడంలో తమిళ తంబిల తర్వాతే ఎవరైనా ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య , విక్రమ్ వంటి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు తెలుగులో డబ్ అయి.. స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో సమానంగా వసూళ్లు సాధించాయి. తెలుగువారు ఎవరినైనా , ఏ రాష్ట్రం వాళ్లనైనా నెత్తిన పెట్టుకుంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఒక తమిళలు కాదు.. కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి వసూళ్లను అందుకున్నాయి. అందుకే ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ హీరోకు తెలుగు మార్కెట్‌పై కన్నుంది. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే చాలు.. రేంజ్ మారిపోతుందని భావిస్తున్నారు.
ఇక కోలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో దూసుకెళ్తున్నారు శివ కార్తీకేయన్. కమర్షియల్ సినిమాలు, ఎక్స్‌పెరిమెంట్స్‌తో చాలా వేగంగా హీరోగా నిలదొక్కుకున్నాడు. తమిళ్‌లో సక్సెస్ అయిన శివ కార్తీకేయన్ తెలుగులోనూ తానేంటో రుజువు చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే అంతగా కాలం కలిసి రావడవం లేదనే అంటున్నారు. తెలుగు వారు ఇతనిని గుర్తుపట్టాలంటే రెమో ఒక్కటే శరణ్యం. అందులో కీర్తి సురేష్ హీరోయిన్ కావడం ఒక ప్లస్ పాయింట్. దిల్‌రాజు అప్పట్లో రెమోను రిలీజ్ చేయడం కూడా శివకార్తీకేయన్‌కు బాగా కలిసొచ్చింది.

ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తీకేయన్ నటిస్తోన్న చిత్రం అమరన్. సాయిపల్లవి ఇందులో హీరోయిన్. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న అమరన్‌లో శివకార్తీకేయన్ సైనికుడిగా కనిపించనున్నారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరన్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు, జవాన్ల కూంబింగ్‌తో నిత్యం యుద్ధభూమిని తలపించే జమ్మూకాశ్మీర్‌లో అమరన్ మూవీని 75 రోజుల పాటు షూట్ చేశారు. శివ ఆరూర్, రాహుల్ సింగ్ రాసిన ' ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్' అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ అనే చాప్టర్ ఆధారంగా అమరన్ తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవి .. మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్‌గా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ , నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

తాజాగా తెలుగులో అమరన్ తెలుగు థియేట్రికల్ హక్కులను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిల శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుంది. ఇది హీరో నితిన్ కుటుంబానికి చెందిన బ్యానర్ అన్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలలో శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీకి కూడా శ్రేష్ట్ మూవీస్ తెలుగునాట పంపిణీదారుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో విక్రమ్ కోసం దూకుడుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన సుధాకర్ రెడ్డి కుటుంబం పనితీరు పట్ల కమల్ హాసన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అమరన్ బాధ్యతను వారి చేతుల్లో పెట్టారు కమల్.


Click it and Unblock the Notifications











