Indra 4K Day 1 Collections : రీరిలీజ్‌లో చిరంజీవి కొత్త రికార్డులు.. ఓవర్సీస్‌లో ఇంద్ర కలెక్షన్ల ఊచకోత
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ఇంద్ర సినిమాను 4కే వెర్షన్‌లో వరల్డ్ వైడ్‌గా రీరిలీజ్ చేశారు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్. బీ.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్రలో చిరంజీవి సరసన సోనాలీ బింద్రే , ఆర్తి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. జూలై 24, 2002న రిలీజైన ఇంద్ర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. అప్పటి వరకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) పేరిట ఉన్న రికార్డును మెగాస్టార్ బద్ధలుకొట్టారు. అప్పట్లో చిత్రీకరణ, నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని కలిపి ఇంద్రకు రూ. 10 కోట్లు ఖర్చయ్యింది.
చిరంజీవి కెరీర్‌కే హైలెట్‌గా నిలిచిన ఇంద్రను 4కే వెర్షన్‌లో ఈ ఆగస్ట్ 22న రీరిలీజ్ చేసింది వైజయంతీ మూవీస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లలో ఇంద్రను రీ రిలీజ్ చేశారు. రెగ్యులర్ మూవీ రిలీజ్‌కు ఎంతటి హంగామా చేస్తారా.. ఇంద్ర రీరిలీజ్‌కు అభిమానులు అంతే సందడి చేశారు. థియేటర్ల వద్ద ఇంద్రలోని చిరంజీవి గెటప్స్‌తో ఉన్న భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్‌మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. బాస్ పుట్టినరోజు కావడంతో స్వీట్లు , పండ్లు పంచారు.

రీరిలీజ్‌ల కాలంలోనూ అభిమానులు వసూళ్లను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు.. ఓపెనింగ్స్ ఎన్ని వచ్చాయి, ఏయే ఏరియాల్లో తమ హీరోల్లో కొత్త రికార్డులు సృష్టించాడు . ఇలాంటి విషయాలను ఫ్యాన్స్ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తుంటారు. ఇవి ఫ్యాన్స్ మధ్య వార్‌కి దారి తీసినా అదో సరదా అని సినీజనాలు చెబుతుంటారు.
మరోవైపు.. రీ రిలీజ్‌లోనూ ఇంద్రసేనారెడ్డి ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా కన్నడ నాట సెన్సేషనల్ ఓపెనింగ్స్‌తో బాస్ బీభత్సం సృష్టించాడు. కర్ణాటకలో రీ రిలీజైన టాలీవుడ్ చిత్రాల్లో వసూళ్లపరంగా గతేడాది వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్‌మెన్ రూ.27 లక్షలకు పైగా కలెక్షన్స్‌తో నెంబర్‌వన్‌గా నిలించింది. ఇప్పుడు ఆ రికార్డును ఇంద్ర బద్ధలుకొట్టింది. తద్వారా రీ రిలీజ్‌ల పరంగా ఆల్‌టైం రికార్డుల కలెక్షన్స్‌ని మొదటి రోజే సొంతం సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెబుతున్నాడు ఇంద్రసేనుడు. చిరంజీవికి కర్ణాటకలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 22 ఏళ్ల కిందట ఇంద్ర రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు చిరు.

ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.05 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఇంద్ర. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ కలిపి రూ.1.92 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టారు చిరు. సీడెడ్ ఏరియాలో రూ. 30 లక్షలు వసూలవ్వగా.. ఓవర్సీస్‌లో ఇంద్ర సరికొత్త రికార్డులు సృష్టించింది. రీ రిలీజ్‌ల విషయంలో గతంలో వచ్చిన అన్ని తెలుగు సినిమాలను పక్కకునెట్టి ఓపెనింగ్ డేలో ఏకంగా 80 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.67,05,116) ఇంద్ర రాబట్టింది. అందుకే అభిమానులు చెప్పేది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మెగాస్టార్ .. మెగాస్టారే.


Click it and Unblock the Notifications











