Jana Nayagan Business: జననాయగన్‌కు రికార్డ్ బిజినెస్... దళపతి విజయ్ చివరి సినిమాకి ఎన్ని కోట్లంటే?
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్, ఛరిష్మా ఉన్న నటుడు ఎవరంటే ఠక్కున వినిపించే పేరు ఇళయ దళపతి విజయ్. దాదాపు మూడున్నర దశాబ్ధాలుగా తన నటన, డ్యాన్స్, ఫైట్స్, వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు దళపతి. అలాంటి విజయ్ రాజకీయాల్లోకి దిగిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు విజయ్.
విజయ్ చివరి చిత్రం
విజయ్ రాజకీయాల్లోకి రావడం కొందరికీ ఆనందాన్ని కలిగిస్తుండగా.. ఆయన అభిమానులకు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు విజయ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం దళపతి విజయ్.. జననాయగన్ సినిమాలో నటిస్తున్నారు. ఇది దళపతి కెరీర్‌లో 69వ చిత్రం. తన సినీ జీవితంలో ఇదే చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం అవుతానని ఆయన వెల్లడించారు.

జనవరి 9న జననాయగన్
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జననాయగన్ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జననాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ సినిమాలకు కలెక్షన్ల వర్షం
కోలీవుడ్‌లో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. విజయ్ చివరి ఐదు చిత్రాలు ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో ఆయన చివరి సినిమా జననాయగన్‌పై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓపెనింగ్స్, కలెక్షన్స్ విషయంలో జననాయగన్ కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
జననాయగన్‌కు రికార్డ్ బిజినెస్
విజయ్ చివరి చిత్రం కావడంతో జననాయగన్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు ఎగబడుతున్నాయి. ఇప్పటికే జననాయగన్ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిలింస్ సంస్థ సొంతం చేసుకుంది. అలాగే 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థ యూరప్ హక్కులను, బోలెన్ సినిమా సంస్థ యూకే హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా జననాయగన్ మూవీ ఇండియాలో ఏరియా వైడ్‌గా చేసిన థియేట్రికల్ బిజినెస్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివరాలు పరిశీలిస్తే..
జననాయగన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
జననాయగన్ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 220 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 210 కోట్ల రూపాయలు, కేరళ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 515 కోట్ల రూపాయల రికార్డ్ బిజినెస్ చేసింది. దీంతో దళపతి విజయ్ మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 1050 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
1000 కోట్ల బిజినెస్‌తో విజయ్ రికార్డ్
ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... జననాయగన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఏకంగా 110 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో హక్కులతో కలిపి విజయ్ చివరి సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డీల్స్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











