మళ్లీ రిలీజ్ డేటిచ్చారు... ఈ సారీ వాయిదా పడదుగా
హైదరాబాద్ : ఇప్పటికే ఎన్నో మార్లు రిలీజ్ డేట్ ఇవ్వటం...పలు కారణాలతో వాయిదా పడటం జరుగుతూనే వస్తోంది నాని ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన చిత్రం 'జెండాపై కపిరాజు'. ముఖ్యంగా ఈ చిత్రంలో తమిళ వెర్షన్ విడుదలై విజయం సాధించకపోవటంతో తెలుగులో బిజినెస్ కు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఈ సారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్ ఇచ్చారు. ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
నిర్మాత మాట్లాడుతూ ''మార్పు మన నుంచే మొదలవ్వాలనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని తెరకెక్కించిన చిత్రమిది. ప్రతి వ్యక్తీ తనను తాను సంస్కరించుకొంటే దేశాన్ని సంస్కరించినట్టే లెక్క అన్న విషయాన్ని దర్శకుడు వినోదాత్మకంగా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. యువతరాన్ని అమితంగా అలరించే ఈ చిత్రంలో నాని నటన అందరికీ గుర్తుండిపోతుంది'' అన్నారు.

నాని మాట్లాడుతూ ''మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం సరైన స్థితిలో ఉంటుందనే అంశంపై నడిచే సినిమా ఇది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మూడు నిమిషాలు ఉండే పోరాట సన్నివేశాన్ని 24 రోజులు చిత్రీకరించాం. ఇప్పుడు దాన్ని తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మరచిపోయాను''అని చెప్పారు.
''తెలుగు తెరపై త్వరలో ఓ మంచి సినిమాను విడుదల చేయబోతున్నాం. జీవీ ప్రకాష్‌కుమార్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాణ సంస్థకు చెందిన మల్టీడైమన్షన్ వాసు.
నాని సరసన అమలాపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్. శరత్‌కుమార్ మరో కీలకమైన పాత్రను పోషించారు. సముద్రఖని దర్శకుడు. రజత్ పార్థసారధి నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్, శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్, కూర్పు: ఫాజల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్.


Click it and Unblock the Notifications











