Jatadhara Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద జటాధార ఎదురీత.. సుధీర్ బాబు మూవీ 2వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు తన కెరీర్‌లో హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విభిన్న కాన్సెప్ట్‌లతో ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆయన నటించిన హారర్ థ్రిల్లర్ 'జటాధర (Jatadhara)' నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల అనంతరం సినిమా మొదటి షో నుంచే మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
'జటాధర' మూవీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, ధన పిశాచి, తాంత్రిక శక్తులు, పురాణ గాధలు వంటి అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ హారర్ జానర్‌లో విభిన్నమైన థీమ్‌ను ఎంచుకున్నారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి అందించిన విజువల్స్ హారర్ వాతావరణాన్ని బాగా రేకెత్తించాయి. సంగీత దర్శకుడు రాజీవ్ రాజ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో థ్రిల్ కలిగించినా, మొత్తంగా ఫిల్మ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్, రవి ప్రకాష్ లాంటి నటులు తమ వంతు పాత్రలను సమర్థవంతంగా చేశారు. కానీ వారికి సరైన స్క్రీన్ టైమ్ దక్కలేదు.

ప్రీ-రిలీజ్ బిజినెస్
'జటాధర' టీజర్, ట్రైలర్ రిలీజ్ సమయంలోనే సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సుధీర్ బాబు యాక్షన్ హీరోగా, సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్‌గా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షిస్తారన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ట్రేడ్ వర్గాల ప్రకారం, 'జటాధర' తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.6 కోట్లు, పాన్ ఇండియా మార్కెట్, ఓటీటీ, శాటిలైట్ హక్కులతో కలిపి సుమారు రూ. 15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిపింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ. 8 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. కానీ మొదటి రెండు రోజుల కలెక్షన్లు చూస్తే ఈ లక్ష్యం సాధ్యం కానట్టే కనిపిస్తోంది.
విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రివ్యూల ప్రకారం, కథ కొత్తదనం ఉన్నా స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం, సస్పెన్స్ లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఉండటం వల్ల సినిమా ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. సుధీర్ బాబు నటన, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం మాత్రమే సినిమా పాజిటివ్ పాయింట్స్‌గా నిలిచాయి. మొత్తం మీద, 'జటాధర' కాన్సెప్ట్ పరంగా బాగున్నా, కథనం బలహీనంగా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్ ప్రయోగం విభిన్నమైనదే కానీ, ఫలిత పరంగా మాత్రం నిరాశపరిచిందని చెప్పాలి.
షాకింగ్ కలెక్షన్స్
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 'జటాధర (Jatadhara)' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు డిజాస్టర్ కలెక్షన్స్ నమోదు చేసింది. తొలి రోజు 'జటాధర' ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1.07 కోట్లు కాగా, అందులో తెలుగు వెర్షన్ రూ. 0.85 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.22 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు (శనివారం) కలెక్షన్లు అదే తీరులో ఉన్నాయి. వీకెండ్ అయినా మార్నింగ్, నూన్ షో థియేటర్ ఆక్యుపెన్సీ 20 శాతం లోపే నమోదు కావడం గమనార్హం. ఈ పరిస్థితి చూస్తే.. ఫస్ట్, సెకండ్ షోలకు కూడా ఇదే రెస్పాన్స్ వచ్చేలా ఉంది. దీని బట్టి చూస్తే.. రెండో రోజు 90 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు వసూలు చేసే అవకాశముంది. దీంతో ఈ మూవీ రెండు రోజుల మొత్తం వసూళ్లు రూ. 2.10 కోట్లకు చేరుకునే అవకాశముంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా ప్రమోషన్లు సరిగా జరగకపోవడం, కంటెంట్ పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే.. గర్ల్ ఫ్రెండ్ లాంటి ఇతర సినిమాల ప్రభావం కూడా 'జటాధర' వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. సినిమా మొదటి రోజే తక్కువ ఓపెనింగ్ అందుకోవడంతో రెండో రోజు ఆక్యుపెన్సీ మరింత తగ్గిపోయింది. మొత్తం మీద, రెండో రోజు కలెక్షన్ పడిపోవడంతో 'జటాధర' బాక్సాఫీస్ రన్ కష్టాల్లో పడింది. మౌత్ టాక్ లేదా ఆదివారం కలెక్షన్లపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో 'జటాధర' వసూళ్లను తిరిగి పుంజుకుంటుందా? లేదా? అనే ఆసక్తి టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications











