Jetlee Day 1 Box Office Collection: జెట్‌లీ తొలి రోజు కలెక్షన్లు.. సత్య సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?
Jetlee Box Office Collection: టాలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్త విషయం కాదు. బ్రహ్మానందం, సునీల్ వంటి వారు ఈ మార్గంలో ముందే విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ స్టార్ కమెడియన్ సత్య (Satya)'జెట్ లీ' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'మత్తు వదలరా' ఫేమ్ Ritesh Rana దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత ఈ సినిమాను నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ కమెడియన్లలో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జెట్ లీ'. సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కామెడీ-యాక్షన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ రిథేష్ రానా తెరకెక్కించగా, ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పించారు. ఇక సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను కార్తీక శ్రీనివాస్ చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ చూసుకున్నారు.

ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. జెట్ లీ సినిమాను సుమారు రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్‌తో పాటు ప్రొడక్షన్, ప్రమోషన్ ఖర్చుల్లో కూడా ఎక్కడా రాజీపడకుండా మేకర్స్ ఖర్చు పెట్టారు. చిన్న సినిమా అయినప్పటికీ ప్రమోషన్ల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేయడంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా సత్య తన స్టైల్‌లో చేసిన ప్రమోషన్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.3.8 కోట్ల మేర బిజినెస్ వాల్యూ ఉండగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.1.2 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ మేరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జెట్ లీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.5 కోట్లకు చేరగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని అంచనా.
కథ విషయానికి వస్తే.. ప్రజాపతి (Ajay) నిర్వహిస్తున్న బ్యాంక్ దివాళా తీస్తుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి. అయితే ఈ మోసానికి హరీష్ చంద్ర ( సుభలేఖ సుధకర్) కారణమని తప్పుడు ఆధారాలు సృష్టించి, ప్రజాపతి దుబాయ్‌కు పారిపోతాడు. ఈ కేసును ఛేదించేందుకు హోమ్ మంత్రి మేల్కొటే ఆదేశాల మేరకు ఏజెంట్ శివానీ రాయ్ (Rhea Singha) రంగంలోకి దిగుతుంది. దుబాయ్‌లో ప్రజాపతిని పట్టుకుని ఇండియాకు తీసుకురావడానికి ఫ్లైట్‌లో ఎక్కించిన సమయంలో కథ మరింత మలుపులు తిరుగుతుంది. అదే ఫ్లైట్‌లో అతడిని హతమార్చేందుకు వేర్వేరు గ్రూపులు ప్రయత్నిస్తుంటాయి. కానీ బ్లైండ్ డాక్టర్ వేదవ్యాస్ (Satya) కారణంగా వారి ప్లాన్స్ దెబ్బతింటాయి. అసలు వేదవ్యాస్ ఎవరు? అతను ప్రజాపతితో సంబంధం ఏమిటి? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే జెట్ లీ సినిమా కథ.
జెట్ లీ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో ఇండియా వైడ్ గా దాదాపు కోటి వరకు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25,000 అమెరికన్ డాలర్లు (రూ. 21 లక్షలు) వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. విడుదల అయిన తరువాత ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. జెట్ లీ (Jetlee) సినిమా తొలి రోజున( డే 1) ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1.5 కోట్ల నుండి రూ 1.6 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications



