రేంజ్ పెరిగిన 'మగధీర'
ప్రస్తుతం ఎదురేలేకుండా ఆడుతున్న సినిమా ఏదంటే మగధీర అని టక్కున చెప్పచ్చు. టాలీవుడ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఆ మధ్యన భారీ అంచనాల మధ్య వచ్చిన విక్రమ్ మల్లన్న మగధీర మానియాకి అడ్డుకట్ట వేస్తుందని అందరూ భావించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బద్దలయిపోవడంతో 'మగధీర' కు అడ్డే లేకుండా పోయింది. ఆ తర్వాతి వారంలో వచ్చిన ఆంజనేయులు చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో 'మగధీర' కలెక్షన్లను ఏ మాత్రం ప్రభావితం చెయ్యలేకపోయింది.
ఇలాంటి సమయంలో యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన 'జోష్' చిత్రం తప్పకుండా మగధీర కలెక్షన్లకు గండి కొడుతుందని అందరూ భావించారు. అపజయమే ఎరుగని రారాజు 'దిల్' రాజు ఈ చిత్రం రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా వచ్చాయి. తీరా సినిమా రిలీజయ్యాక గానీ తెలియలేదు సినిమాలో పెద్దగా విషయం లేదని. యావరేజీ చిత్రంగా టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వల్ల 'మగధీర' చిత్రానికి ఎలాంటి నష్టం కలగకపోగా సినిమా బాగోలేకపోవడం లాభమే అయింది. పైగా 'మగధీర' హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంటే, 'జోష్' కలెక్షన్లు మాత్రం తగ్గాయని పరిశీలకులు చెప్తున్నారు. "కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే మొగుడు" అన్నట్టు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులవడంతో 'మగధీర' ఎదురేలేకుండా దూసుకుపోతున్నాడు.


Click it and Unblock the Notifications











