Devara Day 21 Collections : ఎన్టీఆర్ మాస్ రచ్చ .. రూ.45 కోట్లతో శివతాండవం, 21వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కంటిన్యూ అయిన పెద్ద సినిమాలు తక్కువేనని చెప్పొచ్చు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లను సాధించిన బడా ప్రాజెక్ట్ దేవర. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ ఎన్టీఆర్ మూవీ వరుసగా 19 రోజుల పాటు రోజుకు రూ. కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లను రాబట్టింది. దసరా సెలవులు ముగిసిన తర్వాత మాత్రం దేవర దూకుడు కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో 21వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 గురువారంతో మూడు వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు , మౌత్ టాక్‌ను చూసినవారు ఈ స్థాయిలో దేవర కుమ్మేస్తుందని అనుకుని ఉండరు. కానీ ఎన్టీఆర్ సినిమాను తన భుజాలపై మోశారు. మిక్స్‌డ్ టాక్‌తో దేవర ఊహకందని ఊచకోత కోసింది. దసరాకు పది రోజుల ముందే విడుదలైనా.. పండగ సెలవులను బాగా వాడుకున్నాడు దేవర.

తెలుగు రాష్ట్రాల్లో దేవరకు రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. మూడు వారాల్లో ఏకంగా రూ.156.5 కోట్లకు పైగా షేర్ సొంతం చేసుకుని రూ.45 కోట్లకు పైగా లాభాలను అందుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. తన పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను తారక్ బ్రేక్ చేశారు. తెలుగు నాట దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన దేవర లాంగ్ రన్‌లో ఇంకెన్ని వసూళ్లను సాధిస్తుందో చూడాలి. రజనీకాంత్ నటించిన వేట్టయన్ .. దేవరకు ఏమాత్రం పోటీ ఇవ్వకపోవడం ప్లస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర మరో ఘనత సాధించింది. ఇక 21వ రోజు దేవర ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే .. దసరా సెలవులు ముగిసిన తర్వాత నాల్గవ రోజు, ఫుల్ వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. 21వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.2.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.కోటి, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.18 లక్షల మేర రాబట్టిందని అంటున్నారు. మరి థర్డ్ వీక్ ముగిసే సరికి దేవర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











