Devara Day 22 Collections : బాక్సాఫీస్‌పై ఎన్టీఆర్ దండయాత్ర .. 22వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర అంచనాలను మంచి కలెక్షన్లను రాబడుతోంది. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లో ఆల్‌టైం హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. విజయవంతంగా మూడు వారాలను పూర్తి చేసుకోవడంతో పాటు నాలుగో వారంలోనూ స్లో అండ్ స్టడీగా దుమ్మురేపుతోంది. పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం ఎన్టీఆర్‌కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 22వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .
కొరటాల శివ డైరెక్టర్ కావడంతో పాటు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని అనుకున్న శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని కసిగా ఈ మూవీ తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రూ.172 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్‌తో ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాను తన భుజాలపై నడిపించి బయ్యర్లను ఒడ్డునపడేశారు తారక్.

తెలుగు రాష్ట్రాల్లో దేవర రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. మూడు వారాల్లో ఏకంగా రూ.156.5 కోట్లకు పైగా షేర్ సొంతం చేసుకుని రూ.45 కోట్లకు పైగా లాభాలను అందుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. తన పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను తారక్ బ్రేక్ చేశారు. ఇక 22వ రోజు దేవర ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే .. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి బుకింగ్స్ బాగా జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
22వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.కోటిన్నర, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లను కలుపుకుని రూ.60 లక్షల మేర రాబట్టిందని అంటున్నారు. మొత్తంగా 22 రోజులకు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా దేవర రూ.250 కోట్ల షేర్ అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వీకెండ్ దేవర ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి


Click it and Unblock the Notifications











