Devara Day 28 Collections : దేవర తుఫాను తీరం దాటినట్లేనా? 28వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
విడుదలై నాలుగు వారాలు కావొస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ నటించిన కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. మిక్స్‌డ్ టాక్‌తో వచ్చిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొట్టిపడేసిన దేవర.. బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 28వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందోనని చిత్ర యూనిట్ భయపడింది. కానీ ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌తో సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. రిలీజ్ అయిన నాటి నుంచి 25 రోజుల వరకు రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ సాధిస్తూ వచ్చిన దేవర సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
దేవర మూవీ.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు . ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 25 రోజుల్లోనే తెలుగు వెర్షన్ సినిమాల్లో గ్రాస్ పరంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కల్కి, సలార్ తర్వాతి స్థానంలో దేవర నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.160 కోట్లకు షేర్‌ను దక్కించుకుని బయ్యర్లకు లాభాలను అందించింది.

ఇక 28వ రోజు దేవర వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన రెండు రోజుల నుంచి ఎన్టీఆర్ ఊపు తగ్గింది. 28వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. కోటికి పైగా వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో దేవర మరోసారి తన రేంజ్ మార్క్ చూపిస్తాడని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు... దేవర కారణంగా ఎన్టీఆర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 9 ఏళ్ల నుంచి ఫ్లాప్ అనేది లేకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2015లో టెంపర్‌తో మొదలైన తారక్ విజయాల పరంపర, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్ తాజాగా దేవరతో కంటిన్యూ అయ్యింది. తద్వారా 9 ఏళ్లలో కనీసం ఒక్క ఫ్లాప్ లేని హీరోగా ఎన్టీఆర్ నిలిచారు.


Click it and Unblock the Notifications











