Devara Day 29 Collections : దారుణంగా దేవర కలెక్షన్స్ .. 29వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర థియేట్రికల్ రన్ క్లోజింగ్ దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో వారం ముగించి ఐదో వారంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద జోష్ చూపించడం లేదు. శుక్రవారం వీకెండ్ మొదలైనా సరే దేవర ఏమాత్రం పుంజుకోలేదు. గురువారం కంటే దారుణంగా వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 29వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సెకండ్ మూవీ కావడంతో పాటు ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు .
ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 25 రోజుల్లోనే తెలుగు వెర్షన్ సినిమాల్లో గ్రాస్ పరంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కల్కి, సలార్ తర్వాతి స్థానంలో దేవర నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.160 కోట్లకు షేర్‌ను దక్కించుకుని బయ్యర్లకు లాభాలను అందించింది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందోనని చిత్ర యూనిట్ భయపడింది. కానీ ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌తో సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. రిలీజ్ అయిన నాటి నుంచి 25 రోజుల వరకు రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ సాధిస్తూ వచ్చిన దేవర అరుదైన ఘనత సాధించింది.

నాలుగో వారం ఇండియా వైడ్ నికరంగా రూ.7.8 కోట్ల వసూళ్లను దేవర సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 6.33 కోట్లు, హిందీ , రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ నుంచి రూ.1.30 కోట్ల మేర నికర వసూళ్లను ఎన్టీఆర్ మూవీ దక్కించుకుంది. ఇక 29వ రోజు దేవర వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన రెండు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ ఊపు తగ్గింది. వీకెండ్ అయినప్పటికీ మునుపటి సందడి కనిపించడం లేదు. 29వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38 లక్షల రేంజ్‌లో షేర్ సాధించింది దేవర. ఈ రెండ్రోజులు వీకెండ్ కావడంతో దేవర వసూళ్లు స్వల్పంగా పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే దేవర థియేట్రికల్ రన్ దీపావళితో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











