K Ramp Day 7 Collections: దంచికొడుతున్న కిరణ్ అబ్బవరం.. కే ర్యాంప్ 7 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
K Ramp Box Office Collection: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటారు. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ యువ హీరో తాజాగా "కే ర్యాంప్" అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీపావళి సీజన్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవగా, మొదటి వారం మొత్తంగా హౌస్‌ఫుల్ షోలతో సాగింది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కే ర్యాంప్ మూవీని యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో ఆయన కొత్త రీతిలో కథను చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చి సినిమాకు బలం చేకూర్చారు. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం అద్భుతమైన విజువల్స్ చూపించగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పేస్‌ను అందించింది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశిందనే చెప్పాలి.

ట్రేడ్ సమాచారం ప్రకారం.. "కే ర్యాంప్" సినిమా మొత్తం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇందులో నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలిపి ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. నైజాం రైట్స్ రూ.2 కోట్లు, సీడెడ్ రూ.1.25 కోట్లు, ఆంధ్రా రూ.3 కోట్లు, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల రైట్స్ రూ.0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.1.30 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.8.15 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.9 కోట్ల షేర్, అంటే సుమారు రూ.18 కోట్ల గ్రాస్ రావాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
కే ర్యాంప్ విడుదలైన తొలి రోజే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ.2.8 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు చేరినట్టు నిర్మాతలు తెలిపారు. రెండో రోజు రూ.2.85 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్లు, నాలుగో రోజు రూ.1.85 కోట్లు, ఐదో రోజు రూ.1.3 కోట్లు, ఆరవ రోజు రూ.1 కోటి రూపాయల వసూళ్లు సాధించింది. ఈ లెక్కల ప్రకారం, తొలి వారం మొత్తంలో సినిమా ఇండియా వైడ్ గా రూ.11.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మరోవైపు, మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం మాత్రం సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల కలెక్షన్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలిపారు.
ఇక కే ర్యాంప్ 7 వ రోజు కలెక్షన్ల వివరాలకు వెళ్తే.. సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం షోలలో 18 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 21 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, సాయంత్రం, రాత్రి షోలలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశముంది. సాక్‌నిక్ అంచనాల ప్రకారం 7 రోజు ( నేడు) మరోసారి కోటి రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లెక్కల ప్రకారం "కే ర్యాంప్" 7 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు చేరిందని విశ్లేషకులు తెలిపారు. ఇక వర్డల్ వైడ్ గ్రాస్ రూ. 18 కోట్లు దాటవచ్చని అంచనా.
కే ర్యాంప్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. యాక్షన్, ఎమోషన్, కామెడీ మేళవింపుతో మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తున్నారు. సినిమా మీద వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండటంతో వీకెండ్‌లో మరింతగా కలెక్షన్లు పెరుగుతాయని అంచనా. ట్రేడ్ విశ్లేషకులు చెప్పిన ప్రకారం, "కే ర్యాంప్" రెండో వారాంతానికి రూ.20 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉంది. ఇది జరిగితే, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











