కబీర్ సింగ్ కలెక్షన్లు.. బీహార్‌లో బాహుబలికి ధీటుగా.. 10 వారాల్లో వసూళ్లేంతంటే!
బాలీవుడ్‌లో కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేసింది. గత రెండు నెలలుగా ఎడతెరిపి లేకుండా పలు సినిమాలను ఎదురించి దూసుకెళ్లింది. తెలుగు ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ భారీ వసూళ్లు సాధించినప్పటికీ.. కొన్ని అంచనాలను మించకపోవడం ట్రేడ్ వర్గాలను కొంత నిరాశకు గురిచేసింది. గత 10 వారాలలో కబీర్ సింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లో కుమ్మేసిన కబీర్ సింగ్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ దేశవ్యాప్తంగా విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. బీహార్‌లో బాహుబలి, టైగర్ జిందా హై చిత్రాల తర్వాత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. బీహార్‌లో రూ.10 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది.

దక్షిణాదిలో నిరాశపరిచి..
అయితే దక్షిణాదిలో కబీర్ సింగ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన ఈ చిత్రం ఇంతకుముందే భారీగా వసూళ్లను రాబట్టింది. నైజాం, ఆంధ్ర, మైసూరు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ చిత్రం గతంలోనే అనూహ్యమైన వసూళ్లను రాబట్టింది. అయితే హిందీ రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కుమ్మేసింది.

యూపీ, ముంబైలో
ఉత్తరాదిలో కబీర్‌సింగ్‌కు విశేష ఆదరణ లభించింది. ముంబైలో ఈ చిత్రం రూ.87.21 కోట్లు వసూలు చేయగా, ఢిల్లీ, యూపీలో కలిపి రూ.66.18 కోట్లు రాబట్టింది. ఈ ప్రాంతాల్లో ఈ వసూళ్లే ఆల్‌టైమ్ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పదో వారంలో కూడా మిగితా చిత్రాల పోటీని తట్టుకొని కొద్దిపాటి వసూళ్లను రాబట్టడం విశేషం.

ఓవర్సీస్‌లోను భారీగా
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రేక్షకులు కబీర్ సింగ్‌ను బ్రహ్మండంగా ఆదరించారు. విదేశాల్లో ఈ చిత్రం సుమారు రూ.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.377 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక స్వదేశంలో రూ.330 గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా నికర వసూళ్లు రూ. 276 కోట్లుగా పేర్కొన్నారు.

10 వారాల కలెక్షన్లు
కబీర్ సింగ్ సాధించిన 10 వారాల కలెక్షన్లు ఇలా..
తొలి వారం రూ. 1,33,13,00,000
రెండోవారం రూ. 78,18,00,000
మూడో వారం రూ. 36,51,00,000
నాలుగో వారం రూ.16,36,00,000
ఐదో వారం రూ. 7,89,00,000
ఆరో వారం రూ. 2,65,00,000
ఏడో వారం రూ. 1,06,00,000
ఎనిమిదో వారం రూ. 46,00,000
తొమ్మిదో వారం రూ. 6,50,000
పదో వారం (మూడు రోజులు) రూ. 50,000
మొత్తం వసూళ్లు రూ. 276,31,00,000


Click it and Unblock the Notifications











