మరో మైలురాయిని దాటిన ‘కబీర్ సింగ్’.. మొదటి స్థానం కైవసం
తెలుగు సినీ ఇండస్ట్రీలో సరిహద్దులను చెరిపేసిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. అడల్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ తమ భాషల్లో రీమేక్ చేసుకుంటామని చిత్ర యూనిట్‌ను సంప్రదించారు. తాజాగా ఇదే సినిమా హిందీలోనూ విడుదలైంది.
'కబీర్ సింగ్' పేరుతో విడుదలైన ఈ సినిమాలో షాహీద్ కపూర్ - కియారా అద్వాణీ జంటగా నటించారు. అలాగే, తెలుగు సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సందీప్ రెడ్డి వంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 'కబీర్ సింగ్'కు హిందీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే 'కబీర్ సింగ్' భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో స్థానం కూడా సంపాదించుకుంది.

తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని దాటేసింది. గత నెల 21న విడుదలైన ఈ సినిమా శుక్రవారంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసింది. దీంతో 2019లో ఈ మైలురాయిని అందుకున్న తొలి చిత్రంగా 'కబీర్ సింగ్' నిలిచింది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్స్' - రూ. 244 కోట్లు, సల్మాన్ ఖాన్ 'భారత్' - రూ. 211, అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' - రూ. 155 కోట్లు, అజయ్ దేవగణ్ 'టోటల్ దమాల్' - రూ. 154 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక వీకెండ్ల వారీగా 'కబీర్ సింగ్' కలెక్షన్లను పరిశీలిస్తే.. మొదటి వారం ఈ సినిమా రూ. 134. 42 కోట్లు, రెండో వారం రూ. 78.78 కోట్లు, మూడో వారం రూ. 36.40 కోట్లు వసూలు చేసింది. ఇక 22 రోజులకు ఈ సినిమా రూ. 250 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.


Click it and Unblock the Notifications











