Kalki 2 Overseas Business: ఓవర్సీస్‌లో ప్రభాస్ సంచలనం.. కల్కి 2కి రికార్డ్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్‌లకు అతీతంగా స్టార్‌డమ్‌తో దూసుకెళ్తున్నారు డార్లింగ్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్‌ను ప్రస్తుతం బీట్ చేసే స్టార్ లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ది రాజాసాబ్ డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ 200 కోట్లకు పైగా వసూలు చేసిందంటే అది ప్రభాస్ క్రేజ్ మహిమ. రాజాసాబ్ షాకిచ్చినా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా కల్కి 2 ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సెట్స్ మీద ఉండగానే ఈ స్థాయిలో డీల్ జరగడం మామూలు విషయం కాదు. ఈ వివరాల్లోకి వెళితే..
కల్కి 2 బిజినెస్‌పై రూమర్స్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. సలార్ 2ను మినిహాయిస్తే మిగిలిన మూడు సినిమాల షూటింగ్స్ సైలెంట్‌గా జరిగిపోతోంది. వచ్చే రెండేళ్లలో ఆయన నుంచి వరుస సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏది ముందుస్తుందో చెప్పడం కష్టం. అయితే బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే.. మూడు చిత్రాలది డిఫరెంట్ స్టోరీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కి 2 ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

భారీ వసూళ్లతో కల్కి రికార్డ్
ప్రభాస్ కెరీర్‌లో కల్కి 2898 ఏడీ డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు శోభన, దీపికా పదుకొనె, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ తదితరులు నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కల్కి 2898 ఏడీకి ఇండియాలో 646.31 కోట్ల రూపాయల నెట్.. 767.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో 275 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రభాస్ మూవీకి 1042.25 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే కల్కి 2898 ఏడీకి 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
2027లో కల్కి 2 రిలీజ్?
ఇంతటి భారీ విజయం తర్వాత కల్కికి సీక్వెల్‌గా కల్కి 2ను తెరకెక్కించాలని వైజయంతి మూవీస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆమె ప్లేస్‌లో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ రెండు సినిమాలను పూర్తి చేసి కల్కి 2 సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 2027 సమ్మర్ లేదా దసరాకి కల్కి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కల్కి 2 ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ధర?
ఇదిలాఉండగా.. సెట్స్ మీదకి వెళ్లకుండానే కల్కి 2కు రికార్డ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ హైప్ నేపథ్యంలో ఆంధ్రా, నైజాం, కర్ణాటక, తమిళనాడు, హిందీ ఏరియాల థియేట్రికల రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ డీల్స్‌తో ముందుకొస్తున్నారు. తాజాగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరతో పార్శ్ ఫిలింస్ దక్కించుకున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ డీల్ విలువ 115 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉందట. అదే నిజమైతే ఒక్క ఓవర్సీస్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. దీనిని బట్టి ప్రభాస్ క్రేజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే.. థియేటర్‌లలో రిలీజయ్యే నాటికి కల్కి 2 హైప్ ఓ రేంజ్‌లో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కల్కి 2 ఓవర్సీస్ రైట్స్ నిజంగానే ఈ స్థాయిలో అమ్ముడుపోయాయా? లేక గాలివార్తా? అనేది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











