1000 కోట్ల దీపిక పదుకోన్.. హిందీ ఇండస్ట్రీలో ఏకైక హీరోయిన్‌గా రికార్డు.. షారుక్, రణ్‌బీర్‌కు ధీటుగా!
ఒక సినిమా సక్సెస్ అయ్యింది అనడానికి చిత్ర పరిశ్రమలో గతంలో రకరకాల కొలమానాలు ఉండేవి. సిల్వర్ జూబ్లీ , గోల్డెన్ జూబ్లీతో పాటు ఎన్ని వారాలు సినిమా ప్రదర్శితమైందనే విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ లెక్కలు, కొలమానాలు లేవు.. ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్నదే ఇప్పుడు ముఖ్యం. పాన్ ఇండియా కల్చర్ మొదలయ్యాక ఇది మరింతగా మారిపోయింది.
వేరు వేరు ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకొచ్చి , ఒకే చోటికి చేర్చి సినిమాలు తెరకెక్కిస్తూ ఉండటంతో మార్కెట్ పరిధి పెరిగి భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లోనే సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోతోంది. ఏకాస్త బాగున్నా అలవోకగా రూ.500 కోట్లు పక్కా అనే సెంటిమెంట్ సినీ జనాల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి నాగీ సెల్యూలాయిడ్‌పై విజువల్ వండర్ ఆవిష్కరించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణేల నటన.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అమలాపురం నుంచి అమెరికా వరకు కల్కి 2898 ఏడీ కలెక్షన్ల దుమ్ముదులుపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అ సినిమా తొలిరోజు రూ.191.5 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వీకెండ్ ముగిసే నాటికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో కల్కి 2898 ఏడీ రూ.1000 కోట్ల మార్కును దాటడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. ఈ మూవీ ఘన విజయం సాధించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కల్కి బ్లాక్ బస్టర్ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు మారుమోగిపోతోంది. పాన్ వరల్డ్ హీరోయిన్‌గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇండియన్ హీరోయిన్లలో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న హీరోయిన్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలోనూ దీపిక ముందు వరుసలో ఉంది. తాజాగా ఆమె మరో ఘనతను తన పేరిట లిఖించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన పఠాన్, జవాన్ సినిమాలలో దీపిక నటించారు.
ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. తద్వారా బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలలో భాగమైన హీరోయిన్‌గా దీపిక రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడీలోనూ ఆమె నటించగా.. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ మూవీ కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మూడు సినిమాలలో భాగమైన తొలి హీరోయిన్‌గా దీపిక ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది.

కోవిడ్ అనంతరం దీపిక నటించిన 83 (102 కోట్లు), పఠాన్ (543.22 కోట్లు) , ఫైటర్ (212.50 కోట్లు), కల్కి 2898 ఏడీ (149 కోట్లు ఇప్పటి వరకు ) షేర్ సాధించాయి. అంటే మొత్తం రూ.1006.72 కోట్లు. తద్వారా ఏ భారతీయ నటి మునుపెన్నడూ అందుకోని మైలురాయిని దీపిక సాధించారు. అలాగే బాక్సాఫీస్ వద్ద ఈ ఘనత సాధించిన మరో ఇద్దరు భారతీయ నటులు రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్‌లు మాత్రమే కావడం విశేషంగా మారింది.
పఠాన్, జవాన్, డుంకీతో షారుఖ్ మొత్తంగా రూ.1415.64 కోట్లు సాధించారు. తు ఝూతి మైన్ మక్కర్, యానిమల్ , బ్రహ్మాస్త్ర చిత్రాల ద్వారా రణబీర్ కపూర్ రూ.1011 కోట్లు అందుకున్నాడు. ఇందులో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన షంషేరా కలెక్షన్లు కూడా ఉన్నాయి. సో.. అదన్నమాట మేటర్.


Click it and Unblock the Notifications











