Kara Day 1 Box Office Collection: 'కర' మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Kara Box Office Collection: తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా 'కుబేర'తో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన 'ఇడ్లీ కొట్టు' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా 'కర' సినిమాతో తమిళ స్టార్ ధనుష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త ఆశలతో ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు కనిపించగా, దర్శకుడు విఘ్నేష్ రాజా చిత్రాన్ని రూపొందించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో సీ.హెచ్. సతీష్ కుమార్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. G.V.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. తొలి రోజు వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఇక సినిమా కథ విషయాన్ని వస్తే.. 1991 కాలంలోని ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగే ఈ సినిమా, మనుగడ కోసం పోరాడితే ఒక వ్యక్తి అంతర్గత సంఘర్షణలను తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనుష్ 'కరస్వామి' అనే దొంగ పాత్రలో కనిపిస్తారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక దొంగగా జీవించిన అతడు ఆ జీవితం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. కానీ అనివార్య పరిస్థితులు అతడిని మళ్లీ నేర ప్రపంచంలోకి నెడతాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం బ్యాంక్ దోపిడీలకు దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ అధికారిగా సూరజ్ వెంజరమూడు కనిపిస్తాడు.

ఇక ఈ సినిమాలో మమిత బైజు ధనుష్ భార్యగా కీలక పాత్రలో కనిపిస్తుండగా, వారి మధ్య ఉన్న భావోద్వేగ బంధమే కథ. 90ల నేపథ్యం, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్-అన్నీ కలిపి 'కర' చిత్రాన్ని విభిన్నంగా రూపొందించారు. మొత్తంగా, ఇది కేవలం యాక్షన్ సినిమా కాకుండా, భావోద్వేగాలతో నిండిన కథగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. ప్రేక్షకులు ధనుష్ నటనను ప్రశంసిస్తూ, ఇది స్లో-బర్న్ థ్రిల్లర్‌గా బాగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుందని కొందరూ కామెంట్స్ చేయగా,మరికొందరూ మాత్రం సినిమా నెమ్మదిగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక కర సినిమా కోసం సుమారు రూ.68 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్స్, ప్రింట్స్ అన్నీ కలిపి ఉన్నాయి. థియేట్రికల్ బడ్జెట్ మాత్రమే సుమారు రూ.57 కోట్ల వరకు ఉందని సమాచారం. హీరో ధనుష్‌కు సుమారు రూ.30 కోట్ల పారితోషికం ఇవ్వగా, హీరోయిన్ మమితా బైజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు టాక్. మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ ఖర్చులతో పాటు సెట్స్, షూటింగ్, VFX కోసం భారీగా వెచ్చించడంతో ప్రొడక్షన్ ఖర్చులు పెరిగాయి. అదనంగా ప్రమోషన్స్, ట్రైలర్, మ్యూజిక్ వంటి అంశాలకు మరో రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసుకోవడం మరో ప్రత్యేకత. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.56 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇందులో ఓటీటీ హక్కులను నెట్ ఫిక్స్ ( Netflix) రూ.36 కోట్లకు సొంతం చేసుకోగా, శాటిలైట్ హక్కులను సన్ టీవీ నెట్ వర్క్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్. మ్యూజిక్ రైట్స్‌ను కూడా మంచి ధరకు అమ్మడం వల్ల రిలీజ్‌కు ముందే సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ హక్కుల ద్వారా కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తమిళనాడులోనే రూ.34 కోట్ల బిజినెస్ జరగగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9 కోట్లు, కేరళ, కర్ణాటక, నార్త్ ఇండియా ప్రాంతాల్లో కూడా మంచి రేట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.57 కోట్లకు చేరుకోవడం విశేషం.
కర సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా సినిమాకు భారీ స్పందన వచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రోజు ఉదయం 7 గంటల వరకు దాదాపు రూ.3.55 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తమిళనాడు నుంచి మాత్రమే రూ.2.34 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలోనూ భారీ స్పందన లభించింది. ఓవర్సీస్ ప్రీ-సేల్స్ రూ.78 లక్షలు దాటడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ సుమారు రూ.4.33 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.
ఇక ఫస్ట్ డే (Day 1) అంచనా కలెక్షన్ల విషయానికి వస్తే.. ట్రేడ్ వెబ్‌సైట్ల ప్రకారం.. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొదటి రోజు అంచనాల ప్రకారం.. ఈ సినిమా ఇండియా వైడ్ గా సుమారు రూ.6 కోట్లు (నెట్), గ్రాస్‌గా రూ.7.40 కోట్లు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో మరో రూ.2 కోట్లు రాబట్టే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ధనుష్ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉందని అంచనా.
ఇలా మొత్తంగా చూస్తే.. కర సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ, దీని అసలు రన్ మాత్రం మౌత్ టాక్‌పై ఆధారపడనుంది. ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ, సినిమా కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. భారీ బడ్జెట్ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ చేరాలంటే రాబోయే రోజుల్లో భారీ మొత్తం కలెక్షన్లు రాబట్టాలి. తొలి రోజు అందుకున్న బజ్ కొనసాగిస్తేనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications