మహేష్, రామ్ చరణ్ లను ఛాలెంజ్ చేస్తున్న కార్తీ
హైదరాబాద్: కార్తీ, అనుష్క జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం 'అలెక్స్ పాండ్యన్'. తెలుగులో బ్యాడ్‌బాయ్‌గా విడుదల కానుంది. సూరజ్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. జ్ఞానవేల్‌రాజా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ 'నాయక్', మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలు రెండూ సంక్రాంతికి భారీ ఎత్తున భాక్సాఫీస్ వద్ద మోహరించటానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్యన నలిగిపోతామని చాలా సినిమాల విడుదలలు వాయిదా వేసుకుంటున్నారు. అయితే కార్తీ మాత్రం తన చిత్రం కూడా భారీగానే విడుదల చేసి ఈ రెండు చిత్రాలకు పోటీ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. కార్తీకి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. అయితే అతని శకుని చిత్రం తెలుగులో ఆడలేదు.
రామ్ చరణ్, కాజల్, అమలా పాల్ నటించిన 'నాయక్' జనవరి 9న విడుదల కానుంది. వి.వి.వినాయక్ దర్శకుడు. డి.వి.వి.దానయ్య నిర్మాత. యస్.రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. యూనివర్శల్ మీడియా పతాకంపై తెరకెక్కింది. థమన్.యస్. సమకూర్చిన స్వరాలు ఇటీవల విడుదలయ్యాయి. 'ఒయ్యారమంటే ఏలూరే' పాటలో చరణ్ పక్కన ఛార్మి స్టెప్పులేసింది. చిరంజీవి, రాధ ఒకప్పుడు స్టెప్పులేసిన 'శుభలేఖ రాసుకున్న' పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయడం విశేషం.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 11న విడుదల కానుంది. వెంకటేష్, మహేష్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. 'దూకుడు' తర్వాత సమంత మరోసారి మహేష్‌తో జోడీ కట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కీ స్వరపరచిన మెలోడీలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. దాదాపు పాతికేళ్ళ తర్వాత వస్తున్న భారీ మల్టీస్టారర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, అంజలి పాత్రలు కీలకం.


Click it and Unblock the Notifications











