Kesari 2 Day 7 Collections: కేసరి 2 మూవీకి 50 కోట్లు కలెక్షన్లు. ఇంకా ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ హీరోలుగా, అనన్య పాండే, రెజీనా కసండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కేసరి చాప్టర్ 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ కలిసి నిర్మించిన ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు.
భారత స్వాతంత్ర ఉద్యమంలో జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ సాగించిన దమనకాండ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? జరిగిన బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
జలియన్ వాలా బాగ్ దుర్ఘటనకు కారణమైన జనరల్ డయ్యర్‌పై బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసిన అడ్వకేట్ జనరల్ శంకరన్ నాయర్ న్యాయపోరాటం బ్యాక్ డ్రాప్‌గా కేసరి చాప్టర్ 2 రూపొందింది. 1500 మందికిపైగా పొట్టన పెట్టుకొన్న మారణ కాండకు డయ్యర్ కారణం అంటూ శంకరన్ వేసిన కేసును ఆధారంగా చేసుకొని హై ఎమోషన్స్‌తో కూడిన కోర్టు డ్రామాగా తెరకెక్కింది. సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ తదితరులు నటించారు.

కేసరి 2 సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్యపాండే, రెజీనా ఇతర నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిసి ఈ పిక్చర్ నిర్మాణ వ్యయం సుమారుగా 150 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే పోటీపడుతూ నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజున రికార్డు కలెక్షన్లు రాబట్టలేకపోయినా సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి రోజు నుంచి నిలకడగా, స్ట్రాంగ్‌గా కలెక్షన్లు వసూలు చేస్తున్నది. ఈ సినిమా తొలి రోజు కంటే వసూళ్లను పుంజుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ సినిమా తాజాగా 50 కోట్ల మైలురాయిని దాటడం విశేషంగా మారింది.
ఇండియాలో గత 6 రోజులుగా కేసరి రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 8 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 4వ రోజు 4.5 కోట్లు, 5వ రోజు 5 కోట్ల రూపాయలు, 6వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కనిపించిందని ట్రేడ్ వర్గాలు, సాక్ నిల్క్ వెల్లడించింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ఓ మాదిరి స్పందన వ్యక్తమవుతున్నది. అక్షయ్ కుమార్ నటించిన గత సినిమాల కంటే మెరుగైన వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 6 రోజుల్లో 2 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 16.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా ఈ వారాంతంలో బెటర్ పెర్ఫార్మ్ చేస్తే 100 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేసరి 2 ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 42.5 కోట్ల నెట్, 48 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 16.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 58.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 7వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ఏడో రోజున 2.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 50 కోట్లు వసూల చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











