Mass4K Day1 collections : రీ రిలీజ్‌లో ఉసూరుమనిపించిన నాగ్.. మాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
ప్రజంట్ టాలీవుడ్ టూ బాలీవుడ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజులను పురస్కరించుకుని వారి బ్లాక్‌బస్టర్స్ మూవీస్‌ని 4కే వెర్షన్‌లో వదులుతున్నారు. అసలే సినిమాలు లేక మూసుకోవాల్సిన పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లను రీరిలీజ్‌లు మళ్లీ నిలబెడుతున్నాయి. స్ట్రెయిట్ సినిమా మాదిరే ఫ్యాన్స్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతూ థియేటర్లను ముస్తాబు చేస్తున్నారు. అలాగే నిర్మాతకు మరోసారి కాసుల పంట పండిస్తున్నాయి రీ రిలీజ్‌లు.
ఒకరిని చూసి మరొకరు రీ రిలీజ్‌లను ప్రోత్సహిస్తున్నారు మన స్టార్స్. పవన్ కళ్యాణ్ ఖుషి, మహేశ్ బాబు పోకిరి, మురారి... రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఇంద్రలు 4కే వెర్షన్‌లో రీ రిలీజై రికార్డుల మోత మోగించాయి. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఇంద్ర 22 ఏళ్ల తర్వాత కూడా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

రీరిలీజ్‌లో ఇంద్ర రూ.2.44 కోట్ల షేర్‌ని రాబట్టగా.. గ్రాస్ పరంగా చూస్తే రూ.3.6 కోట్లను సాధించింది. సీనియర్ హీరోల రీ రిలీజ్‌లలో ఇంద్రసేనుడు నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచాడు. కర్ణాటకలో రీ రిలీజ్‌ల విషయంలో మహేశ్ బాబు బిజినెస్‌మెన్ పేరిట ఉన్న రికార్డును చిరంజీవి బ్రేక్ చేశారు. అలాగే ఓవర్సీస్‌లోనూ ఇంద్ర వసూళ్లపరంగా సరికొత్త రికార్డులు సృష్టించాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఖుషి, మురారి, ఇంద్ర బాటలోనే కింగ్ నాగార్జున హిట్ మూవీ మాస్‌ను 4కే వెర్షన్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. నాగ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్ట్ 28న ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ లారెన్స్ డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే ఆయన బ్లాక్‌బస్టర్ కొట్టి, నాగార్జునకు సూపర్‌హిట్ అందించారు. ఇందులో నాగ్ సరసన జ్యోతిక హీరోయిన్‌గా నటించగా.. రఘువరన్, రాహుల్ దేవ్ విలన్ పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు ఇప్పటికీ నాగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ నాగార్జునకు అత్యధిక వసూళ్లు సాధించి పెట్టిన చిత్రంగా నిలిచింది.

రీరిలీజ్‌లోనూ మాస్ మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వారు అందించిన గణాంకాలను బట్టి ఈ సినిమా ఫస్ట్ డే రోజున హైదరాబాద్‌లో 63 శాతం ఆక్యూపెన్సీతో రూ.4.9 లక్షలు సాధించిందట. ఏపీ, తెలంగాణలలో 44 శాతం ఆక్యూపెన్సీతో రూ.11.3 లక్షలు, కర్ణాటకలో రూ.1.3 లక్షలు కలెక్షన్స్ సాధించింది. ఇక ఆల్ ఇండియా స్థాయిలో 12.6 లక్షల వసూళ్లు రాబట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా చూస్తే సీనియర్ హీరోల రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో నాగ్ కొంత వెనుకబడినట్లుగా చెప్పాలి. ఫుల్ బాక్సాఫీస్ రిపోర్టు వస్తే కానీ మాస్ లెక్కలు తేలవు.


Click it and Unblock the Notifications











