VBVK 2 Weeks Collections: 4.50 కోట్ల టార్గెట్.. 2 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం. అయితే, ఈ మధ్య కాలంలో అతడు సరైన విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కిరణ్ 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభంలో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. రెండో వారంలో మాత్రం కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రెండు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

నెంబర్ నైబర్ కాన్సెప్టుతో కిరణ్
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమానే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు
కిరణ్ అబ్బవరంకు ఏపీ, తెలంగాణలో మార్కెట్ పెద్దగా లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది.

14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి మొదటి ఆట నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, క్రమంగా అవి పడిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కిరణ్ నటించిన ఈ సినిమాకు 14వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 5 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది
2 వారాల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.77 కోట్లు షేర్, రూ. 9.12 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 2 వారాల్లోనే ఏపీ, తెలంగాణలో రూ. 4.77 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 33 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.35 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే
నెంబర్ నైబర్ కాన్సెప్టుతో వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 5.26 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 76 లక్షలు లాభాలు కూడా దక్కాయి.


Click it and Unblock the Notifications











