Kuberaa Closing Collections Worldwide: కుబేర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా కుబేర చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నలు కీలకపాత్రలు పోషించారు. ఫీల్‌గుడ్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కుబేర సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కాంబో అనగానే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న జత కలవడంతో బజ్ ఏర్పడింది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగ్.. ఈ చిత్రంతో కొత్త అవతారంలోకి అడుగుపెట్టారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు శేఖర్ కమ్ముల బ్రాండ్ ఇమేజ్‌తో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.

కుబేర బడ్జెట్ ఎంత?
నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తేడా రాకుండా కుబేర చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.145 కోట్ల వ్యయం అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కుబేర ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాంలలో రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున వరల్డ్ వైడ్‌గా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. ధనుష్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.66 కోట్ల షేర్.. రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో కుబేర వసూళ్లు
16 రోజుల వరకు నైజాంలో 17.25 కోట్ల రూపాయలు , సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 1.70 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.40 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.30 కోట్ల రూపాయల చొప్పున ఆంధ్రా, నైజాంలలో కుబేరకు నికరంగా 40 కోట్ల రూపాయల నెట్.. 66 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 34 కోట్ల రూపాయల గ్రాస్‌గా ట్రేడ్ పండితులు నిర్దేశించగా.. ఆ టార్గెట్‌ను ధనుష్ కొట్టేశాడు.
ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కుబేర వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకు తొలి వారం ఇండియా వైడ్ 69 కోట్లు, రెండవ వారంలో 15.65 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. 16 రోజుల వరకు తమిళనాడులో 20.47 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 11.55 కోట్ల రూపాయలు, కేరళలో 1.25 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 16 రోజుల వరకు ఇండియాలో కుబేరాకు 86.42 కోట్ల రూపాయల నెట్, 101 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్‌లో శేఖర్ కమ్ముల, ధనుష్, రష్మిక మందన్నల కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు కుబేరకు 30.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలోని గ్రాస్‌కు ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల రూపాయలు ఆర్జించింది.
కుబేరకు లాభమెంత? నష్టమెంత?
బాక్సాఫీస్ వద్ద కుబేర విశ్వరూపం ప్రదర్శించింది. విడుదలైన 12 రోజుల వరకు రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా కలెక్షన్స్ సాధించింది. సెకండ్ వీక్ ఎండింగ్ నుంచి కుబేరకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చింది. కుబేరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించగా.. తమిళనాడులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అక్కడ 18 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా.. 40 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్ల రూపాయల భారీ నష్టాలను మిగిల్చింది. మిగిలిన ఏరియాల థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి కుబేరా చిత్రం ఓవరాల్‌గా దాదాపు 22 కోట్ల రూపాయల నష్టాలను తీసుకొచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే ఓవరాల్ బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నింటి ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. త్వరలో కొత్త సినిమాలు రానున్న నేపథ్యంలో కొన్ని ఏరియాలలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగిస్తుండగా, ఈ వారాంతంతో థియేట్రికల్ రన్ ముగింపుపై పూర్తి క్లారిటీ రానుంది. మరి ధనుష్, అక్కినేని నాగార్జున తమ పరుగు ఆపే వరకు ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











