L2: Empuraan day 3 Collection: మోహన్‌లాల్ ఊచకోత.. ఎంపురాన్‌కు రికార్డు కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ , స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన లూసిఫర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ఎల్ 2: ఎంపురాన్. రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజు ఓపెనింగ్స్ విషయంలో చరిత్ర సృష్టించిన ఎంపురాన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ సినిమా మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా ఎల్ 2 : ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమాకు దాదాపు రూ.150 కోట్ల వ్యయం అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

మోహన్‌లాల్ క్రేజ్, పృథ్వీరాజ్ టేకింగ్‌కు తోడు లూసిఫర్ బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ఎల్ 2 : ఎంపురాన్ చిత్రంపై చిత్ర సీమలో భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మోహన్‌లాల్ నట జీవితంలోనే ఈ స్థాయి విడుదల ఇదే తొలిసారి.
మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఎల్ 2 : ఎంపురాన్.. వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.60 కోట్లు రాబట్టి మోహన్ లాల్ చిత్రం నయా హిస్టరీ అందుకుంది. మార్చి 27న రిలీజ్ రోజున రూ.22 కోట్లు రాబట్టిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలిపి తొలి రోజు రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో వచ్చిన తొలి మలయాళ సినిమాగానూ ఎంపురాన్ నిలిచింది. రెండో రోజూ కూడా ఇదే జోరు కొనసాగించిన ఎంపురాన్ రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టి కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
మూడో రోజు మార్నింగ్ షోలకు 40.70 శాతం, మ్యాట్నీ షోలకు 52.33 శాతం ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. ఫస్ట్ షో, సెకండ్ షోల టికెట్స్ కూడా ఫాస్ట్‌గా బుక్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మూడోరోజే సాయంత్రం 6 గంటల వరకు బెంగళూరులో 504, కొచ్చిలో 318, త్రివేండ్రంలో 281, చెన్నైలో 149 , ముంబైలో 223, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 182 షోలు పడ్డాయి. మూడో రోజు ఎల్ 2: ఎంపురాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మోహన్‌లాల్ - పృథ్వీరాజ్‌లు ఎలాంటి మేజిక్ చేస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











