Laapataa Ladies Collections అమీర్ ఖాన్ మూవీ హిట్టా? ఫట్టా? 20 కోట్ల బడ్జెట్..షాకింగ్‌గా కలెక్షన్లు!
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే నిర్మాతలుగా మారి రూపొందించిన చిత్రం లాపతా లేడీస్. కిరణ్ రావ్ స్వయంగా దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జియో స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ బజ్ అందుకొన్నది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా ఆశించినంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేకపోయవడం ట్రేడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లాపతా లేడీస్ కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన భర్త ట్రైన్‌లో ప్రయాణిస్తూ తన భార్య అనుకొని పొరపాటున కొత్తగా పెళ్లైన మరో మహిళను ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత తాను తీసుకొచ్చింది తన భార్యను కాదని తెలుసుకొంటాడు. తప్పిపోయిన తన భార్యను వెతకడం, తాను పొరపాటున వేరే ఊరికి వచ్చానని మహిళ గ్రహించడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో నితాన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాస్తవ, ప్రతిభా రాంటా తదితరులు నటించారు.

లాపతా లేడీస్ సినిమాను దాదాపు నూతన నటీనటులు, థియేటర్ ఆర్టిస్టులు, ప్రతిభావంతులైన నటులతో రూపొందించారు. నిర్మాణపరంగా తక్కువగానే అంటే.. 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినప్పటికీ.. ప్రమోషన్స్ భారీగా చేయడం, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మరో 10 కోట్లు అదనంగా బడ్జెట్ అయింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లాపతా లేడీస్ 25 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ కావడంతో మూవీని ఇండియాలో 1500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఉత్తరాదిలో తప్ప ఈ సినిమాకు మిగితా చోట్ల వసూళ్లు ఆశాజనకంగా కనిపించడం లేదు. దాంతో అత్యంత పేలవంగా ఈ సినిమా ఫెర్ఫార్మ్ చేస్తున్నది.
అమీర్ ఖాన్, కిరణ్ రావు పేర్లు కూడా లాపతా లేడీస్ చిత్రం కోసం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 75 లక్షలు, వరల్డ్ వైడ్‌గా 1 కోటి రూపాయలు, రెండో రోజు ఇండియాలో 1.45 కోట్లు సంపాదించగా.. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 2.5 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 5.5 కోట్లు రాబట్టింది.

ఇక సోమవారం లాపతా లేడీస్ మూవీకి అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 4వ రోజు నిలబడితే కలెక్షన్లు పుంజుకొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. అయితే ఈ మొత్తానికి మించి వసూళ్లను సాధిస్తే.. మరింత థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











